పాపం భాజపా! ‘ఆ నలుగురు’ బుక్ చేసేస్తున్నారు

రాష్ట్రంలో భాజపా నేతలు నేటికీ తెరాసతో ఏ విధంగా వ్యవహరించాలో తెలియని అయోమయ పరిస్థితిలోనే కొనసాగుతున్నారు. ఎందుకంటే వారు తెరాస ప్రభుత్వంతో పోరాడుతుంటే కేంద్రమంత్రులు, ప్రధాని నరేంద్ర మోడీ కూడా తెరాస ప్రభుత్వం పట్ల చాలా అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. తెరాసలో ‘ఆ నలుగురు’ కెసిఆర్, కెటిఆర్, కవిత, హరీష్ రావు రాష్ట్ర భాజపా నేతలని పెద్దగా పట్టించుకోకపోయినా, ఢిల్లీ పెద్దలతో చాలా చక్కగా మాట్లాడుతుంటారు. భాజపా, తెరాస పెద్దల మధ్య చక్కటి అనుబంధం ఉన్నప్పుడు తాము తెరాస ప్రభుత్వంపై పోరాడినా ప్రయోజనం ఏమిటి? అనే నిరాశ రాష్ట్ర భాజపా నేతలని ఆవరించింది.

పోనీ తెరాస, భాజపాలు కలిసి పనిచేయడానికి సిద్ధపడినా బాగుండేది. కానీ అందుకు రెండు పార్టీల పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. పైగా భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పుడల్లా "వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ లో మనమే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలి...మనమే స్వంతంగా అధికారంలోకి రావాలి..అందుకు రాష్ట్రంలో చాలా అవకాశాలు కనిపిస్తున్నాయి,” అని ఒక అరిగిపోయిన రికార్డు వినిపించి వెళుతుంటారు.

భాజపా, తెరాసల పెద్దలు కలిసి సృష్టించిన ఈ అయోమయ వాతావరణంలోనే రాష్ట్ర భాజపా నేతలు రోజులు లెక్కించుకొంటూ ఏదో అలా కాలక్షేపం చేసేస్తున్నారు. వారి అయోమయ స్థితిని కొనసాగింపజేయడానికే అన్నట్లుగా అప్పుడప్పుడు కేంద్రమంత్రులు వచ్చి తెరాస ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొని ఢిల్లీ వెళ్లిపోతుంటారు. అటువంటప్పుడు రాష్ట్రంలో భాజపా అనే ఒక పార్టీ ఉందని వారికి తెలుసో తెలియదో అనే అనుమానం కలుగుతుంది.

నిజామాబాద్ ఎంపి కవిత ఆధ్వర్యంలో నడుస్తున్న తెలంగాణ జాగృతి సంస్థ ఏర్పాటు చేసిన స్టడీ సర్కిల్ ప్రారంభోత్సవానికి కేంద్రమంత్రులు వచ్చి వెళ్ళినప్పుడు రాష్ట్ర భాజపా నేతలకి మళ్ళీ అటువంటి అనుభవమే ఎదురైంది.

కేంద్రమంత్రులు తమని పట్టించుకోకపోయినా పర్వాలేదు లేదు కానీ తమకి, తద్వారా భాజపాకి రాష్ట్రంలో మంచి పేరు ప్రతిష్టలు తేగల ప్రధానమంత్రి కుశల్ యోజన వంటి కేంద్ర పధకాలని, నిధులని చేజేతులా తమ రాజకీయ ప్రత్యర్ధి చేతిలో పెట్టడం ఏమిటని వారు బాధపడుతున్నారు. తద్వారా భాజపాకి దక్కవలసిన క్రెడిట్ తెరాసకి దక్కుతుంది కదా? అని ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలనుకొంటున్నప్పుడు ప్రజలకి చేరువ కాగల ఇటువంటి పధకాలని భాజపా నేతల ద్వారా ప్రజలకి అందించాలి కానీ తమ రాజకీయ ప్రత్యర్ధికి అందించడం తెలివనిపించుకొంటుందా? అని వారి ప్రశ్న. నిజమే కదా? తెరాసలో ‘ఆ నలుగురి’ ని ధీటుగా ఎదుర్కొనే ఒక్క మొగాడు కూడా భాజపాలో లేడని తెలిసినప్పుడు కనీసం ఇటువంటి అవకాశాలైన రాష్ట్ర భాజపా నేతలకి ఇస్తే దానితో వారు ప్రజలని ఆకట్టుకొనేందుకు వారి తిప్పలేవో వారే పడతుంటారు కదా?