చంద్రబాబు ప్రభుత్వానికి ఊహించని ఎదురుదెబ్బ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాళ హైకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అమరావతి నిర్మాణం కోసం ఎంచుకొన్న స్విస్ ఛాలెంజ్ పద్ధతిని అమలు చేయకుండా హై కోర్ట్ స్టే విధించింది.

దానికోసం టెండర్లు వేసిన ఆదిత్య సంస్థ, చెన్నైకి చెందిన మరో సంస్థ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టులో పిటిషన్ వేశాయి. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో చాలా లోపాలు ఉన్నాయని, అంతిమంగా సింగపూర్ సంస్థకే ఆ పని కట్టబెట్టేందుకు ప్రభుత్వం గోప్యత పాటిస్తోందని, అది ఈ విధానానికి విరుద్ధమని ఆ సంస్థలు వాదించాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదించడానికి భారత అటార్నీ జనరల్ ముకుల్ రోహాత్గీని రప్పించినా ప్రయోజనం లేకుండా పోయింది. పిటిషనర్ల వాదనలతో ఏకీభవించిన హైకోర్టు స్విస్ ఛాలెంజ్ పద్ధతిని అమలు చేయకుండా స్టే విధించింది. తదుపరి విచారణని అక్టోబర్ 31కి వాయిదా వేసింది.

ఏపి సర్కార్ కి ఇది చాలా పెద్ద ఎదురు దెబ్బనే చెప్పవచ్చు. ఎందుకంటే అది సింగపూర్ సంస్థకే నిర్మాణ బాధ్యతలు కట్టబెట్టాలని ఉవ్విళ్ళూరుతోంది. అందుకు వీలు కల్పించేందుకే స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో కొత్తగా టెండర్లు వేసినవారికి సింగపూర్ సంస్థ ఇచ్చిన ప్రతిపాదనలని ఇవ్వకుండా దాచిపెట్టిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ లక్షల కోట్ల వ్యవహారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరే చాలా అనుమానాస్పదంగా ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. అయినా ప్రభుత్వం వెనుకంజవేయలేదు. చివరికి అదే దాని కొంప ముంచిందిపుడు.

ఒకవేళ సింగపూర్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం రహస్యంగా ముందస్తు ఒప్పందాలేవైనా చేసుకొని ఉన్నట్లయితే అది చాలా ఇబ్బందులలో పడుతుంది. ఒకవేళ ఈ స్విస్ ఛాలెంజ్ విధానాన్ని సుప్రీంకోర్టు కూడా తిరస్కరించినట్లయితే ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. అప్పుడు అమరావతి నిర్మాణం కధ మళ్ళీ మొదటికి వస్తుంది. ఈ వ్యవహారాలన్నీ ఒక కొలిక్కి వచ్చేలోగా మిగిలిన రెండున్నరేళ్ళు కూడా గడిచిపోతే వచ్చే ఎన్నికలలో తెదేపాపై ఆ ప్రభావం తప్పకుండా పడవచ్చు.

అమరావతి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో చిల్లి గవ్వలేకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలనుకోవడమే ఒక పొరపాటు. రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని విభజన చట్టంలో ఉంది కనుక రాజధాని ప్రాంతంలో మౌలిక వసతుల కల్పన, అసెంబ్లీ, సచివాలయం, రాజ్ భవన్, హైకోర్టు వగైరా ముఖ్యమైన కట్టడాలకి అవసరమైన నిధులు మంజూరు చేస్తానని కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పుడు, దానికి రాష్ట్ర ప్రభుత్వం మరికొంత జోడించి రాజధానిని నిర్మించుకోవచ్చు. కానీ చంద్రబాబు స్విస్ ఛాలెంజ్ పద్ధతికే మొగ్గు చూపారు.

దానితో సింగపూర్ సంస్థకి, చంద్రబాబు కుటుంబానికి మాత్రమే లాభం కలుగుతుందని, రాష్ట్రం చాలా నష్టపోతుందని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. కానీ వాటి అభ్యంతరాలని, విమర్శలని, ఆరోపణలని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళి ఎదురుదెబ్బ తిన్నారు. కానీ ఇది కేవలం ఆరంభం మాత్రమేనని చెప్పవచ్చు. ఎందుకంటే సింగపూర్ సంస్థతో చేసుకొన్న ఒప్పందం ప్రకారం మున్ముందు ఏవైనా వివాదాలు తలెత్తితే, పక్కనున్న విజయవాడ కోర్టులో కాకుండా బ్రిటన్ లో ఉన్న లండన్ కోర్టులో అమీతుమీ తేల్చుకోవలసి ఉంటుంది. అదెంత కష్టమో ఊహిస్తేనే అర్ధం అవుతోంది. అయినా చంద్రబాబు నాయుడు స్విస్ ఛాలెంజ్ పద్దతికే మొగ్గు చూపుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.