దెబ్బ కొట్టిన తెరాసయే వాటికి ప్రాణం పోస్తోంది

ఒక ఏడాది క్రితం రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల పరిస్థితికి ఇప్పటి పరిస్థితికీ తేడా కళ్ళకి కట్టినట్లు స్పష్టంగా కనబడుతోంది. ఏడాది క్రితం తెరాస కొట్టిన ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకి రాష్ట్రంలో తెదేపా, కాంగ్రెస్ పార్టీలు దాదాపు తమ ఉనికిని కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొన్నాయి. ఓటుకి నోటు కేసుతో తెదేపా ఇంకా దెబ్బై పోయింది. భాజపాని తెరాస టచ్ చేయనప్పటికీ, దానికి కంచుకోట వంటి హైదరాబాద్ జంట నగరాలలోనే దానిని చావు దెబ్బ తీసింది. ఆ దెబ్బతో భాజాపా తెదేపాని కూడా దూరం చేసుకొని మరింత బలహీనపడింది.

కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేతలు తెరాసలోకి క్యూ కట్టి వెళ్ళిపోవడంతో తెలంగాణ లో ఇక ఆ పార్టీ పని అయిపోయిందనే అందరూ అనుకొన్నారు. ఇక తెలంగాణ లో తెరాస ఆధిపత్యాన్ని ప్రశ్నించేవారే లేరు..వచ్చే ఎన్నికలలో దానితో పోటీ చేసేందుకు ప్రతిపక్షమే ఉండదు అనే పరిస్థితి కనిపించింది. కానీ తెరాస కూడా ఊహించని విధంగా రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ మళ్ళీ కోలుకోవడమే కుదరకుండా మళ్ళీ గట్టి సవాలు విసురుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ నిలదొక్కుకొని తెరాస ప్రభుత్వాన్ని గట్టిగా ఎదుర్కొంటోంది.

రాష్ట్రంలో ప్రతిపక్షాలు మళ్ళీ కోలుకోవడానికి వీలు కల్పించింది వాటిని చావు దెబ్బ తీసిన తెరాసయేనని చెప్పక తప్పదు. జీవో:123, వైస్-ఛాన్సిలర్ల నియామకంపై  కోర్టులో మొట్టికాయలు తినడం, సాగునీటి ప్రాజెక్టులలో అవినీతి  ఆరోపణలు, రీ-డిజైనింగ్ పేరిట అంచనాలు పెంచడం, ప్రాజెక్టుల కోసం బలవంతపు భూసేకరణ, జిల్లాల పునర్విభజన ఇలా వరుసగా ఒకదాని తరువాత మరొకటి చొప్పున రాష్ట్ర ప్రభుత్వమే ప్రతిపక్షాలకి కావలసిన ఆయుధాలు అందిస్తూ వాటిని బలోపేతం చేసింది. అంతే కాదు..తన నియంతృత్వ, అప్రజాస్వామిక పోకడలతో వాటిని అభద్రతాభావానికి గురి చేసి వాటన్నిటినీ దగ్గరయ్యేలా చేసింది.

అందుకే ఇవ్వాళ కాంగ్రెస్, తెదేపా, వైకాపా, వామపక్షాలు తమ రాజకీయ భేదాభిప్రాయాలు పక్కనబెట్టి అన్ని పార్టీలు కలిసి ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా నిర్వహించాయి. మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూసేకరణని వ్యతిరేకిస్తూ వేములఘాట్ వద్ద గత 100 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న నిర్వాసిత ప్రజలకి సంఘీభావం తెలుపుతూ వారు ఈ ధర్నా చేపట్టారు. నిరాహార దీక్షలు చేస్తున్న నిర్వాసిత ప్రజలని ప్రతిపక్ష నేతలు కలవనీయకుండా ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తన నిరంకుశత్వాన్ని మరో మారు చాటుకొందని వారు అభిప్రాయం వ్యక్తం చేసారు. తెరాస సర్కార్ ప్రజాస్వామ్యాన్ని చెరబట్టిందని విమర్శించారు. రాష్ట్రంలో లోక్ తంత్ర్ (ప్రజాస్వామ్యం)కి బదులు ఏక్ తంత్ర్ (నిరంకుశ పాలన) సాగుతోందని జైపాల్ రెడ్డి అన్నారు.

ఏడాది క్రితం వరకు తెలంగాణలో ప్రతిపక్షాలు ఉప్పు నిప్పు అన్నట్లుండేవి కానీ ఇప్పుడు అన్నీ ఒక్క తాటిపైకి వచ్చి తెరాస ప్రభుత్వానికి సవాలు విసురుతున్నాయి. ఒకవేళ అవి నిలకడగా ప్రభుత్వంతో తమ పోరాటం కొనసాగించగలిగితే, తెరాసలోకి వెళ్ళిన కాంగ్రెస్, తెదేపా నేతలు మళ్ళీ వెనక్కి తిరిగి రావచ్చు. అప్పుడు అవి మళ్ళీ బలపడితే తెరాస వాటిలో ఒకటిగా మారిపోతుంది. అయితే పరిస్థితి అంతదాకా వెళ్ళే వరకు ముఖ్యమంత్రి కెసిఆర్ చేతులు ముడుచుకొని కూర్చుంటారని అనుకోలేము కనుక త్వరలోనే ఆయనా పావులు కదపడం మొదలుపెట్టవచ్చు.