తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులని, వాటి కోసం జరుగుతున్న భూసేకరణని, జిల్లాల పునర్విభజనని రాష్ట్రంలో ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. అందుకు అవి నిర్దిష్టమైన కారణాలు చెపుతున్నాయి కూడా. కానీ తెలంగాణ రాజకీయ జేఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కూడా ఆ రెండు అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఆయన వాటిని ఖచ్చితంగా చెప్పకుండా అవకాశం చిక్కినప్పుడల్లా ప్రభుత్వంపై సున్నితంగా విమర్శలకే పరిమితం అవుతున్నారు.
అయితే ఆయన మాటలు, కార్యక్రమాలు తెరాస ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నట్లుగా కాకుండా సుతిమెత్తగా హెచ్చరిస్తున్నట్లు మాత్రమే ఉండటం గమనార్హం. ఇవే అంశాలుపై రాష్ట్రంలో ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరుతో ఆయన తీరుని పోల్చి చూసినట్లయితే ఆ తేడా ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన రాజకీయ నాయకుడు కాదూ...తెలంగాణ రాజకీయ జేఏసి రాజకీయ పార్టీ కాదు కనుకనే ఆ విధంగా కొంచెం న్యూట్రల్ గా వ్యవహరిస్తున్నట్లు అని సర్ది చెప్పుకోవచ్చు కానీ అది ప్రజలకి తప్పుడు సంకేతాలు పంపుతున్నట్లు అవుతోంది.
రాష్ట్రంలో ప్రతిపక్షాలని తెరాస నిర్వీర్యం చేసింది కనుక వాటి స్థానంలో అయన ధైర్యంగా ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకు ప్రజలు చాలా సంతోషిస్తున్నారు. ఆయన కూడా తన మాటలతో ప్రజలకి అటువంటి నమ్మకమే కలిగించారు. కానీ ఎందుకో ఎన్ని రోజులైనా తన స్పీడ్ ఏమాత్రం పెంచడం లేదు. అలాగని స్లో చేయడం లేదు. న్యూట్రల్ గా సాగిపోతున్నారు.
తెలంగాణ ప్రభుత్వ లోపాలని, అది చేస్తున్న తప్పులని ఎత్తి చూపిస్తున్నారు కానీ వాటిని సవరించుకొనేందుకు ప్రభుత్వంపై ఎటువంటి ఒత్తిడి చేయడం లేదు. “నేను చెప్పవలసింది చెప్పాను దానిని పాటిస్తారో లేదో ఇక మీ ఇష్టం,” అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఆయన వంటి మేధావి కూడా సాగునీటి ప్రాజెక్టులు, జిల్లాల పునర్విభజనలో లోటుపాట్ల గురించి గట్టిగా తన అభిప్రాయాలని చెప్పలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్వర్యంలో ‘అభివృద్ధి-ప్రజాస్వామ్యం’ అనే అంశంపై నల్లగొండలో నిన్న జరిగిన సదస్సులో ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అసమగ్రమైన ప్రణాళికలతో చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టుల వలన ప్రజాధనం వృధా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బలవంతపు భూసేకరణకి పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. హుస్నాబాద్ లో ఒక కార్యక్రమానికి హాజరైనప్పుడు ఆదివాసీ ప్రాంతాలన్నీ కలిపి ఒక జిల్లా ఏర్పాటు చేయాలని అన్నారు. అప్పుడే వారు కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చెందేందుకు వీలు పడుతుందని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై కోర్టు కేసులని కూడా ఎదుర్కొని ముందుకు సాగుతోంది. జిల్లాల పునర్విభజన ప్రక్రియ కూడా దాదాపు పూర్తి చేసేస్తోంది. ఒకపక్క ఈ రెండు పనులు శరవేగంగా ముందుకు సాగిపోతున్నప్పుడు, తను గమనించిన లోపాలని ప్రభుత్వానికి తెలియజేసి వాటిని సవరించుకొనేలా ఆయన ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి చేయకుండా ఈ విధంగా మొక్కుబడిగా హెచ్చరికలు లేదా సూచనలు చేయడం వలన ఏమి ప్రయోజనం? ఆయన వంటి మేధావి అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకి మధ్య వారధిగా నిలిచి అందరికీ ఉపయోగపడేలా వ్యవహరిస్తే బాగుంటుంది కదా!