ఆంధ్రాలో ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక హోదా ఉద్యమాల గురించి, ఆంధ్రా రాజకీయ నేతల గురించి తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటిఆర్ చాలా చక్కగా విశ్లేషించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక హోదా పేరుతో రాజకీయాధిపత్యం కోసం పార్టీలు పోరాడుకొంటున్నాయని అన్నారు. కనీసం ఇప్పటికైనా ఆధిపత్య పోరాటాలని పక్కనబెట్టి, అందరూ కలిసి పోరాడి ప్రత్యేక హోదా సాధించుకోవడానికి ప్రయత్నిస్తే తప్పకుండా సాధించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. అసలు ప్రత్యేక హోదా వలన కలిగే ప్రయోజనాలేమిటో ప్రజలకి చెప్పలేకపోయారని అన్నారు. ఆంధ్రాకి ఏమి కావాలనే విషయం పై అక్కడి నేతలో స్పష్టత లేదని కెటిఆర్ అభిప్రాయపడ్డారు.
కెటిఆర్ చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజమని చెప్పవచ్చు. ఏపిలో ప్రతిపక్షాలకి నిజంగా ప్రత్యేక హోదా సాధించుకోవాలనే తపనే ఉంటే అది సాధించుకొనే వరకు నిరంతరంగా కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ఉండేవారు. కానీ పార్లమెంటు సమావేశాలు జరిగినప్పుడు మాత్రమే వాటికి ప్రత్యేక హోదా గుర్తుకు వస్తుంది. అప్పుడు అన్ని పార్టీలు గట్టిగా దాని గురించి మాట్లాడటం మొదలుపెడతాయి. జగన్ నిత్యం దాని గురించే మాట్లాడుతున్నా, ఆ వంకతో చంద్రబాబు నాయుడుని తిట్టిపోయడానికే పరిమితం అవుతారు. కాంగ్రెస్ పార్టీ తన మనుగడ కోసం దానిని ఉపయోగించుకొంటోంది. వీలైనప్పుడల్లా దానితో అది మోడీ ప్రభుత్వాన్ని దెబ్బ తీద్దామని ప్రయత్నిస్తుంటుంది. ప్రత్యేక హోదా రాదనే సంగతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చాలా కాలమే క్రితమే తెలిసి ఉన్నప్పటికీ ప్రజలకి భయపడి చెప్పకుండా దాచిపెడుతూ, తప్పనిసరైనప్పుడు దానితో కేంద్రప్రభుత్వం చెయ్యి మెలిపెట్టే ప్రయత్నం చేస్తుంటారు.
ఈ విధంగా ఏ పార్టీకి ప్రత్యేక హోదా సాధించాలనే తపన, చిత్తశుద్ధి లేకపోవడం వలన ప్రతిపక్షాలు చేతిలో అదొక రాజకీయ ఆయుధంగా మారిపోయింది. వాటి మధ్య ఉన్న రాజకీయ వైషమ్యాల కారణంగా అవి ఎన్నడూ ఒకదానికి మరొకటి సహకరించుకొనే పరిస్థితి కూడా లేదు. ఆ సంగతి కేంద్ర ప్రభుత్వానికి కూడా బాగా తెలుసు అందుకే అది కూడా కప్ప గంతులు వేస్తూ రెండునరేళ్ళు కాలక్షేపం చేసేసింది. మిగిలిన రెండున్నరేళ్ళు కూడా కాలక్షేపం చేసేయడం తధ్యం. తెలంగాణ సాధన కోసం రాష్ట్రంలో అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి పోరాడి సాధించుకొన్నాయి. తెదేపా వంటి పార్టీలు మొదట్లో తెలంగాణ ఉద్యమాలకి దూరంగా ఉన్నా, చివరికి అవి కూడా పోరాడక తప్పని పరిస్థితి కలిగింది. ఆ క్రెడిట్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి కెసిఆర్ కే దక్కుతుంది. కానీ ఆంధ్రాలో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అన్ని పార్టీలకి ఎప్పుడూ ఎన్నికల మీదే దృష్టి. ఏ పోరాటం చేసినా ఆ దృష్టితోనే చేస్తుంటాయి.
రాష్ట్ర విభజన జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ 11 రోజులు అన్నం తినడం మానేశానని చెప్పడం గురించి చాలా మంది పెద్దగా పట్టించుకోలేదు, కానీ కెటిఆర్ దృష్టి నుంచి అది కూడా తప్పించుకోలేదు. అనేక దశాబ్దాల సుధీర్ఘ పోరాటం తరువాత తెలంగాణ ఏర్పడినందుకు తెలంగాణ ప్రజలు అందరూ సంతోషిస్తుంటే పవన్ కళ్యాణ్ బాధతో అన్నం తినడం మానేశానని చెప్పడం ప్రజల మనసులని నొప్పిస్తుందని అన్నారు. నిజమే కదా!