జిల్లాల పునర్విభజన గురించి తెరాస ప్రభుత్వంపై వస్తున్న విమర్శలు, ఆరోపణలకి ముఖ్యమంత్రి కెసిఆర్ ధీటుగా జవాబు చెప్పారు. ప్రజలు కోరుకొన్నవిధంగానే, వారికి సౌకర్యవంతంగా ఉండే విధంగా జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తామని, ప్రజల సలహాలు స్వీకరించి వాటిని అమలు చేయడానికి తామేమీ కించపడినట్లు భావించబోమని చెప్పారు. కొత్త జిల్లాల ముసాయిదా ప్రకటనకి ప్రజల నుంచి వస్తున్న సూచనలని, సలహాలని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తదనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తూనే ఉన్నామని అన్నారు.
ప్రజల సూచనల ప్రకారం రంగారెడ్డి జిల్లాలో ఉన్న మొయినాబాద్ మండలాన్ని కొత్తగా ఏర్పాటు చేయబోతున్న శంషాబాద్ జిల్లాలో కలపుతున్నట్లు తెలిపారు. అదే విధంగా కొత్తగా ఏర్పాటు చేయబోతున్న మహాబూబాబాద్ జిల్లాలో తొర్రూరుని రెవెన్యూ డివిజన్ గా మార్చి, కొడకండ్ల మండలాన్ని దానిలో చేర్చుతున్నట్లు తెలిపారు. అదే విధంగా మరికొన్ని మండలాలు, రెవెన్యూ డివిజన్ల కూర్పులో కూడా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేస్తున్నట్లు ప్రకటించారు. వరంగల్ జిల్లాపై ప్రజలు, ప్రతిపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నందున పునర్విభజనపై పునరాలోచిస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్షాలు కూడా ప్రజలకి ఉపయోగపడే విధంగా నిర్మాణాత్మకమైన సలహాలని ఇస్తే స్వీకరించడానికి తనకి అభ్యంతరం లేదని అన్నారు.
ఈ జిల్లాల పునర్విభజన కారణంగా కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు రెండు జిల్లాలో ఉండే అవకాశం ఉందని ఆయన అంగీకరించారు. అయితే దేశంలో చాలా రాష్ట్రాలలో ఆ విధంగా ఉన్నప్పటికీ ఎటువంటి సమస్య ఎదురవడం లేదు కనుక తెలంగాణ లో కూడా ఇబ్బంది ఉండకపోవచ్చని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
దసరా నుంచి కొత్త జిల్లాలు పనిచేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చాలా చురుగ్గా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి కెసిఆర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, స్వయంగా ఈ ఏర్పాట్లని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ జిల్లా కలెక్టర్లకి, అధికారులకి తగిన సూచనలు, సలహాలు ఇస్తూ, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా అవసరమైన మార్పులు చేర్పులు చేస్తున్నారు.
దసరా నుంచి కొత్త జిల్లాలలో విద్యా, వ్యవసాయం, రెవెన్యూ, పంచాయితీ రాజ్, పోలీస్ శాఖలు పని మొదలుపెట్టి ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. అప్పుడే వివిధ శాఖలలో ఉద్యోగులు, వారికి కార్యాలయాలు, అవసరమైన చోట స్పెషల్ ఆఫీసర్ల నియామకాలు, నూతన విధివిధానాలు, వారందరి మధ్య సమన్వయపరిచేందుకు అవసరమైన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.
కనుక జిల్లాల పునర్విభజన చర్చించడానికి ముఖ్యమంత్రి మళ్ళీ అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తారో లేదోనని ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాల పునర్విభజన విషయంలో తెరాస సర్కార్ ప్రజాభిప్రాయానికి అనుగుణంగా అవసరమైన మార్పులు చేర్పులు చేస్తున్నప్పటికీ, ఒకసారి ప్రతిపక్షాలతో మళ్ళీ అఖిలపక్ష సమావేశం నిర్వహించి వాటి అభిప్రాయలు, సూచనలు, సలహాలు కూడా తీసుకొన్నట్లయితే, ఇక ప్రభుత్వాన్ని వారు కూడా వేలెత్తి చూపలేరు కదా!