తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గత ఆరు దశాబ్దాలుగా ఏదో ఒక స్థాయిలో పోరాటాలు జరుగుతూనే ఉన్నా, వాటిని పతాక స్థాయికి తీసుకుపోయి తెలంగాణ సాధించిన ఘనత మాత్రం ఖచ్చితంగా తెరాస పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ దేనని అందరికీ తెలుసు. అయితే సోనియా గాంధీ దయతోనే తెలంగాణ ఏర్పడిందని కాంగ్రెస్ నేతలు నేటికీ వాదిస్తూనే ఉంటారు. వాళ్ళకి అదో తుత్తి. దానిని ఎవరూ కాదనక్కరలేదు. సోనియా గాంధీ అంగీకరించడం వలనే తెలంగాణ ఏర్పడిందని ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా చెప్పుకొని తన కృతజ్ఞత, హుందాతనాన్ని చాటుకొన్నారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం తెలంగాణ కోసం పోరాడిన కెసిఆర్ ని ఆ విధంగా గౌరవిస్తూ ఒక్క ముక్క కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. అదీ వారి సంస్కారం. పైగా అయన తెలంగాణ సాధన కోసం చేసిందేమీ లేదని, కనీసం ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి చేయడంలో కూడా కొత్తగా ఆయన చేస్తున్నది ఏమీ లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కె. జానారెడ్డి చెప్పడం విశేషం.
దేవరకొండలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రైతు రణభేరి బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన ఈ మాటలనన్నారు. అవి చెపుతున్నప్పుడు, ‘ఒకవేళ కెసిఆర్ తెలంగాణ సాధన కోసం ఉద్యమించి ఉండకపోతే ఏమై ఉండేది అని ఒకసారి జానారెడ్డి ఆలోచించి మాట్లాడి ఉంటే బాగుండేది. ఆయనతో సహా కాంగ్రెస్ పార్టీ నేతలందరికీ ఎప్పుడూ మంత్రి పదవులు, అధికారం, ఎన్నికలలో టికెట్లు సాధించుకోవడంపైనే దృష్టి ఉండేది తప్ప ఏనాడూ తెలంగాణ రాష్ట్రాన్ని కనీసం తమ తమ నియోజకవర్గాలని అభివృద్ధి చేసుకొందామనే తాపత్రయం, ఆలోచన కలుగలేదు.
తెలంగాణని ఆంధ్రా పాలకులు నిర్లక్ష్యం వహించి ఉంటే అది సహజం అని సరిపెట్టుకోవచ్చు కానీ జానారెడ్డి వంటి అచ్చమైన తెలంగాణ నేతలు కూడా తెలంగాణ అభివృద్ధి గురించి ఎందుకు ఆలోచించలేకపోయారు? అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ గురించి ఆలోచించలేనివారు ఇప్పుడు తెరాస ప్రభుత్వం ఏ అభివృద్ధి పని చేసినా అది మేమే చేశామని గొప్పలు కూడా చెప్పుకోవడం ఇంకా సిగ్గుచేటు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో మహా ఒప్పందం చేసుకొని కెసిఆర్ తిరిగి వచ్చినప్పుడు, కాంగ్రెస్ నేతలకి ఆయన విసిరిన సవాలుకి నేటికీ జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారంటేనే తెలంగాణ కోసం కాంగ్రెస్ నేతలు ఏమి చేయలేకపోయారని అర్ధం అవుతోంది.
రణభేరి సభలో జానారెడ్డి మాట్లాడుతూ, తమ ప్రభుత్వ హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకొంటే తాము పరుగున పోయి వారి కుటుంబాలకి రూ.1.5లక్షలు అందించే వారమని, కానీ తెరాస సర్కార్ రూ.6 లక్షలు ఇస్తామని మాటలు చెప్పడమే తప్ప ఏనాడూ ఆత్మహత్యలు చేసుకొన్న రైతులని ఆదుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు.
అయితే ఆయన మాటలలోనే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. అసలు కాంగ్రెస్ హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఏర్పడినప్పుడు దానిని నివారించడానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటే ఏమీ చేయలేదు, కానీ రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నాక వారి కుటుంబాలకి నష్టపరిహారం ఇచ్చామని జానారెడ్డే చెప్పుకొంటున్నారు. తెరాస సర్కార్ రైతులకి 6 లక్షల నష్టపరిహారం అందిస్తోందో లేదో రైతులే చెప్పాలి. కానీ రైతులు ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితిని దూరం చేసేందుకే ప్రభుత్వం మిషన్ కాకతీయ చేపట్టి గొలుసుకట్టు చెరువులని మళ్ళీ పునరుద్ధరించింది.
సాగునీటి ప్రాజెక్టులకి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి రైతులకి నీళ్ళు అందించడం మొదలుపెట్టింది. తెలంగాణలో చాలా జిల్లాలలో సాగునీటి సౌకర్యం కల్పించకపోవడం వలన బోరు బావులపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. కానీ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తెలంగాణలో తీవ్ర విద్యుత్ సంక్షోభంలో చిక్కుకొని ఉండటంతో బోరు బావులలో నీళ్ళు ఉన్నప్పటికీ విద్యుత్ లేక రైతులు తమ పంటలని ఎండబెట్టుకొనే దుస్థితి ఉండేది. ఆ కారణంగా మొదట్లో చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్న సంగతి అందరికీ తెలుసు. కెసిఆర్ అధికారం చేపట్టగానే మొట్ట మొదట విద్యుత్ సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కింఛి రైతుల ప్రాణాలు కాపాడగలిగారు.
ఈ విషయాలన్నీ అపార రాజకీయ అనుభవజ్ఞుడైన జానారెడ్డికి తెలియదనుకోలేము. అయినా విమర్శలు గుప్పిస్తున్నారంటే ప్రతిపక్షంలో ఉన్నందునే అని చెప్పకతప్పదు. ఒకానొక సమయంలో ఆయన కూడా తెరాసలో చేరిపోవడానికి సిద్ధమైనట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఒకవేళ చేరిపోయుంటే ఆయన నోట కెసిఆర్ గుణగణాలు కీర్తిస్తూ మాటలు వినబడేవి. ఆయన కళ్ళకి తెలంగాణ అభివృద్ధి కనబడి ఉండేది. కనుక కాంగ్రెస్ నేతలు తమ కాంగ్రెస్ కళ్ళద్దాలు పక్కనపడేసి తెలంగాణ కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తే మంచిదేమో?