మహబూబ్ నగర్ ఆ విషయంలో మరీ అంత వెనుకబడి ఉందా?

ప్రపంచదేశాలతో భారత్ పోటీ పడుతున్న ఈ రోజుల్లో కూడా ఇటువంటి విషయాల గురించి చర్చించుకోవలసి రావడం చాలా బాధాకరమే. దేశంలో 40 శాతం కంటే తక్కువ మరుగుదొడ్లు కలిగిన ఐదు రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఒకటి. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో 35 శాతం ఇళ్ళలో మాత్రమే మరుగుదొడ్లు ఉన్నాయని స్వచ్ఛ్ భారత్ మిషన్ డైరెక్టర్ ఎం.రామ్ మోహన్ తెలిపారు. అదే విధంగా రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లాలో సుమారు 86 శాతం ఇళ్ళలో మరుగుదొడ్లు లేవని చెప్పారు. అంటే దానినే వేరే విధంగా చెప్పుకొన్నట్లయితే కేవలం 14శాతం ఇళ్ళలోనే మరుగుదొడ్లు ఉన్నాయని అర్ధం. ఈ ఆధునిక యుగంలో ఇటువంటివి ఊహించడం కూడా కష్టమే కానీ ఇది వాస్తవమని తెలిపారు. రాష్ట్రంలో అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 80 శాతం ఇళ్ళలో మరుగుదొడ్లు ఉన్నాయని ఆయన తెలిపారు.

అందుకు నీటి లభ్యత, పేదరికం, సాంఘిక దురాచారాలు, పాత ఆలోచనా విధానాలు, పాత కాలపు అలవాట్లు వంటి అనేక కారణాలున్నాయని యూనిసెఫ్ ప్రతినిధి సలతేయిల్ నల్లి తెలిపారు. అనేక మంది ప్రజలు రూ.10-12,000 పెట్టి మొబైల్ ఫోన్స్ కొనుకొనేందుకు ఆసక్తి చూపుతున్నారు తప్ప ఇళ్ళలో మరుగుదొడ్లు నిర్మించుకోవడానికి ఆసక్తి చూపక పోవడం, దిగ్బ్రాంతి కలిగించే విషయం అని అన్నారు తెలంగాణ స్వచ్ఛ్ మిషన్ కార్యకర్త రాములు నాయక్. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రపంచ బ్యాంక్, అనేక అంతర్జాతీయ సంస్థలు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వస్తున్నా కూడా అనేక ప్రాంతాలలో ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు కలుగకపోవడం వలన ఆ సహాయాన్ని ఉపయోగించుకోవడం లేదని రాములు నాయక్ చెప్పారు.

“వరంగల్ జిల్లాలో గంగాదేవి పల్లె గ్రామంలో ప్రజలందరినీ ఒప్పించి మరుగుదొడ్లు నిర్మించడానికి మాకు మూడు నెలలు పట్టింది కానీ వాటినే ప్రజలు వాడుకొనేలా చేయడానికి మాకు మూడేళ్ళు పట్టింది,” అని ఆ గ్రామ మాజీ సర్పంచ్ కె.రాజమౌళి తెలిపారు. అయితే ఇది సుమారు 16సం.ల క్రితం నాటి విషయం అని ఇప్పుడు ప్రజలందరూ వ్యక్తిగత మరుగుదొడ్లనే నిర్మించుకొని వాడుకొంటున్నారని రాజమౌళి తెలిపారు.

ఇళ్ళలోనే ఇటువంటి పరిస్థితి ఉంటే ఇక ప్రభుత్వ పాఠశాలలో పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఉండే బాలికల పాఠశాలలో పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. అనేక పాఠశాలలో మరుగుదొడ్లు లేనే లేవు. ఉన్నా అవి సరైన నిర్వహణ లేకపోవడం చేత వాడుకొనేందుకు ఉపయోగపడని పరిస్థితిలో ఉన్నాయి. ఈ కారణంగా బాలికలు చాలా ఇబ్బందులకి గురవుతున్నారు. మంచి నీళ్ళు త్రాగితే మూత్రవిసర్జనకి వెళ్ళవలసి వస్తుందనే భయంతో నీళ్ళు త్రాగడం మానేస్తున్నారు. ఆ కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గిపోయి చిన్న వయసులోనే తీవ్ర ఆరోగ్య సమస్యలని ఎదుర్కొంటున్నారు.

మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ్ భారత్ స్పూర్తితో తెలంగాణ ప్రభుత్వం స్వచ్ఛ్ తెలంగాణ పధకాన్ని అమలుచేయడం మొదలుపెట్టాక మెల్లగా సత్ఫలితాలు కనబడుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలలో మరుగుదొడ్ల నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది రూ.350 కోట్లు ఖర్చు చేస్తోంది. కానీ ఈ సమస్యని అధిగమించాలంటే ప్రభుత్వమొక్కటే కృషి చేస్తే దానికి చాలా సమయం పడుతుంది. కార్పొరేట్ సంస్థలు, స్వచ్చంధ సంస్థలు, ఎన్నారైలు అందరూ తలో చెయ్యి వేయవలసి ఉంది.

మరుగుదొడ్లు నిర్మాణం చేయడం ఎంత అవసరమో, వాటిని సమర్ధంగా నిర్వహించడం, ఈ విషయంలో ప్రజలని చైతన్యవంతులని చేయడం కూడా అంతే అవసరం ఉంది. మన రాష్ట్రానికి ఇటువంటి అప్రదిష్ట రాకూడదనే పట్టుదల ప్రజలలో కూడా కలగాలి. అప్పుడే ఈ సమస్య శాశ్వతంగా పరిష్కరించడం సాధ్యం అవుతుంది.