అయ్యో! ఆ నలుగురిని రేవంత్ రెడ్డి ఎంత మాటనేశాడు!

“తెరాస నేతలు ఎవరైనా కొడుకు (కెటిఆర్)ని కలిస్తే మేనల్లుడు (హరీష్ రావు) కి కోపం వస్తుంది. మేనల్లుడిని కలిస్తే తండ్రి కొడుకులు (కెసిఆర్, కెటిఆర్)కి కోపం వస్తుంది. పోనీ కెటిఆర్, హరీష్ లని ఎవరైనా కలిస్తే అమ్మ(కవిత)కి కోపం వస్తుంది. పోనీ అమ్మనే కలిస్తే వారికీ, తండ్రి(కెసిఆర్)కి కోపం వస్తుంది. ఎవరు ఎవరిని కలిసినా ఎవరో ఒకరికి కోపం వస్తుంటుంది. దీనితో తెరాసలో నేతలు ఎవరిని కలిస్తే ఏమవుతుందో అనే భయంతో బ్రతుకుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం ఎవరిని సంప్రదించాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొని ఉంది ఆ పార్టీలో. ఒకవేళ ఆ నలుగురిని కాకుండా ఇంకెవరు మాట్లాడుకోవాలన్నా ఏ రెవెన్యూ ఆఫీసు దగ్గరో మరోచోటో కలుసుకొని మాట్లాడుకోవలసిన దుస్థితి ఉంది.”

ఈ మాటలు అన్నది మరెవరో కాదు కెసిఆర్ ని ధైర్యంగా ఢీ కొనే ‘ఒక్క మగాడు’ రేవంత్ రెడ్డి. సుమారు 3 నెలల క్రితం తెదేపా నుంచి తెరాసలో చేరిన గుండ్లపోచంపల్లి పంచాయితీ మాజీ ప్రెసిడెంట్ ఎం. శ్రీనివాస్ రెడ్డి మళ్ళీ మొన్న తెదేపాలోకి వచ్చేశారు. ఆ సందర్భంగా తెరాసలో పరిస్థితిని వివరిస్తూ రేవంత్ రెడ్డి ఈ మాటలన్నారు.

మళ్ళీ తెదేపా గూటికి చేరుకొన్న శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “తెదేపాలోకి వచ్చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. తెరాసలో ఉన్నప్పుడు ఊపిరి సలపనట్లు ఉండేది. ఎవరితో మాట్లాడితే ఏమవుతుందో, అసలు ఎవరితో మాట్లాడాలో కూడా తెలిసేది కాదు. అందుకే మళ్ళీ తెదేపాలోకి వచ్చేశాను,” అని అన్నారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ “మా పార్టీలో నుంచి తెరాసలో చేరిన మరికొందరు ఎమ్మెల్యేలు కూడా తాము ఆ పార్టీలో ఇమడలేకపోతున్నామని చెపుతున్నారు. తెదేపాలో ఉన్నంత స్వేచ్ఛ తెరాసలో లేదని వారు చెపుతున్నారు. మాగంటి గోపీనాద్ వంటి కొందరు ఎమ్మెల్యేలు మేము చేపడుతున్న పోరాటాలని మెచ్చుకొంటున్నారు. నేడు కాకపోయినా మున్ముందు ఏదో ఒకరోజు తెరాసలోకి వెళ్ళిన మా పార్టీ నేతలు అందరూ మళ్ళీ మా పార్టీలోకి వచ్చేస్తారనే నమ్మకం నాకుంది,” అని అన్నారు.   

రేవంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి చేపుతున్నవి కొంచెం అతిశయోక్తిగా కనిపిస్తున్నప్పటికీ నిప్పు లేనిదే పొగ రాదన్నట్లుగా, కెసిఆర్ లో కనిపించే నియంతృత్వ ధోరణి, పార్టీపై, ప్రభుత్వంపై అయన కుటుంబ సభ్యుల ఆధిపత్యం, గమనిస్తే వారి మాటలలో ఎంతో కొంత నిజముందనే నమ్మవలసి ఉంటుంది.