కొత్త జిల్లాల ఏర్పాటుతో తెలంగాణ కి అంత లాభమా? వెరీ గుడ్!

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో 17 కొత్త జిల్లాలని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతుంటే దానిపై చాలా భిన్నాభిప్రాయాలు, విమర్శలు, ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే తెరాస నేతలు ఎంతసేపు ప్రతిపక్షాలని గట్టిగా ఎదుర్కోవడానికే ప్రయత్నిస్తున్నారు కానీ జిల్లాల పునర్విభజన వలన ప్రజలకి, రాష్ట్రానికి కలిగే లాభాలు లేదా ప్రయోజనాల గురించి చెప్పుకోవడంలో అశ్రద్ధ వహిస్తున్నారు.

ఈ అంశంపై రాష్ట్రంలో ప్రతిపక్షాలు తమ వాదనలని చాలా బలంగానే వినిపిస్తున్నాయి కానీ తెరాస నేతలు ఎదురుదాడికే పరిమితం అవడం వలన, రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోకుండా చాలా నిరంకుశంగా వ్యవహరిస్తోందనే భావనని ప్రతిపక్షాలు ప్రజలకి కలిగేలా చేయగలుగుతున్నాయి. దానికి తోడు మీడియాలో ఒక వర్గం జిల్లాల పునర్విభజనలో మంచి చెడుల గురించి విశ్లేషింఛి ప్రజలకి చెప్పే ప్రయత్నం చేయకుండా, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలనే ఎక్కువగా హైలైట్ చేస్తుండటం వలన ప్రజలలో ప్రభుత్వంపై అనుమానాలు, అపోహలు ఇంకా పెరుగుతున్నాయి.

ఉదాహరణకి ఈ అంశంపై ప్రభుత్వానికి అందిన అర్జీలన్నిటినీ ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత ముఖ్యమంత్రి కెసిఆర్ కలెక్టర్లతో సమావేశం నిర్వహించి, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా రాష్ట్రంలో మరో 30 కొత్త మండలాలని ఏర్పాటు చేయాలని నిశ్చయించుకొన్నారు. దీనిని ఒక చిన్న వార్తగానే మీడియా చూపింది తప్ప అందులో ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి, ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే నడుచుకొంటున్నారనే విషయాన్నీ హైలైట్ చేయలేదు. అదే విధంగా జిల్లాల పునర్విభజన పట్ల వస్తున్న వ్యతిరేకతకి ఇస్తున్న ప్రాధాన్యం, దానిలో మంచి చెడులు గురించి విశ్లేషించడానికి మీడియా ఆసక్తి చూపడం లేదు. తెరాస నేతలు, మంత్రులు కూడా ఈ విషయంలో అశ్రద్ధ చేస్తున్నారనే చెప్పక తప్పదు.

ఉదాహరణకి జిల్లాల పునర్విభజన వలన కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి అదనంగా ఏటా రూ.850కోట్లు లభించబోతున్నాయి. ఏవిధంగా అంటే, రాష్ట్ర విభజన చేసినప్పుడు రాష్ట్రంలో ఒక్క హైదరాబాద్ మినహా మిగిలిన 9 జిల్లాలని కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తించింది. వాటి అభివృద్ధి కోసం ఒక్కో జిల్లాకి రూ.50 కోట్లు చొప్పున ఏడాదికి రూ. 450 కోట్లు ఇస్తోంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అవే 9 జిల్లాలని 17గా పునర్విభజించడం వలన అదనంగా ఏటా రూ.850కోట్లు లభించబోతున్నాయి. అంటే ఇప్పటివరకు ఏడాదికి రూ. 450 కోట్లు మాత్రమే వస్తుంటే, ఇకపై రూ.1,350 కోట్లు రాబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అందుకు అవసరమైన ప్రతిపాదనలని సిద్దం చేస్తోంది. ఈ విషయాన్నీ తెరాస మంత్రులు, నేతలు ప్రజలకి చెప్పుకోవడంలో అశ్రద్ధ వహించారు. అందుకే మీడియా కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఒకటి రెండు పత్రికలు మాత్రం ఈ విషయం గురించి చిన్న వార్తని ప్రచురించాయి.

కొత్త జిల్లాల ఏర్పాటు వలన రాష్ట్ర ఖజానా మీద 17 రెట్లు అదనపు భారం పడబోతోంది. ఒక్కో జిల్లాకి రూ.కోటి రూపాయల చొప్పున ముఖ్యమంత్రి మొన్ననే నిధులు మంజూరు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాబోయే ఈ అదనపు నిధుల వలన ఇటువంటి ఆర్ధిక భారం చాలా వరకు తగ్గుతుంది కదా!