రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన ఏర్పాటుపై ప్రజలు, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నుంచి వస్తున్న అర్జీలనన్నిటినీ పరిశీలించిన ప్రభుత్వం వాటిలో ఎక్కువగా అదనంగా మండలాల ఏర్పాటు చేయాలనే అభ్యర్ధనలు వచ్చినట్లు గుర్తించింది. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా కొత్తగా మరో 30మండలాలని ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ అనుమతించారు. కొన్ని రోజుల క్రితం ప్రభుత్వం జారీ చేసిన ముసాయిదా నోటిఫికేషన్ లో 45 మండలాలతో కలుపుకొంటే ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం 75 మండలాలు ఏర్పాటు అవుతాయని స్పష్టం అయ్యింది.
ముఖ్యమంత్రి కెసిఆర్ నిన్న హైదరాబాద్ లో జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డిజిపి అనురాగ్ శర్మ, మంత్రులు జగదీశ్ రెడ్డి, మహేందర్ రెడ్డి తదితరులందరూ పాల్గొన్న సమావేశంలో ఈ కొత్త మండలాలు ఏర్పాటుపై లోతుగా చర్చించిన తరువాత ఈ నిర్ణయం తీసుకొన్నారు. అదిలాబాద్ లో 3 మండలాలు, నిజామాబాద్-7, మహబూబ్ నగర్-2, నల్లగొండ-1, మెదక్-6, కరీంనగర్-9, ఖమ్మం-3, రంగారెడ్డి-2, వరంగల్-2 మండలాలని అదనంగా ఏర్పాటుచేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
మండలాల కూర్పు పూర్తయిన తరువాత రెవెన్యూ డివిజన్ల కూర్పుపై చర్చిద్దామని ముఖ్యమంత్రి అధికారులకి సూచించారు. వరంగల్ ని రెండుగా విభజించాలనే ప్రభుత్వ ప్రతిపాదనపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నందున, ఆ ఒక్క అంశంపై ఒకరోజు వేరేగా చర్చిద్దామని ముఖ్యమంత్రి సూచించారు.
కానీ ఎట్టి పరిస్థితులలో కూడా అక్టోబర్ 11 (దసరా) నాటికి కొత్త జిల్లాలన్నీ పనిచేయడం మొదలుపెట్టాలని, అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఈలోగానే పూర్తి చేసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులని గట్టిగా ఆదేశించారు. ముఖ్యంగా కొత్త జిల్లాలకి అవసరమైన రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం మొదటి రోజు నుంచే పనిచేయడానికి సిద్ధంగా ఉండేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్లని, డిజిపి అనురాగ్ శర్మని ముఖ్యమంత్రి కోరారు.
ఈ కసరత్తు అంతా పూర్తి చేసిన తరువాత మళ్ళీ మరోమారు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు డికె అరుణ, పొన్నాల లక్ష్మయ్య కోరుతున్నట్లుగా గద్వాల్, జనగామలని జిల్లాలుగా ప్రకటించే అవకాశం లేనట్లు తెలుస్తోంది.