తెలంగాణ ప్రభుత్వానికి మరో సవాలు.. ఈసారి కోదండరాం నుంచి!

టిఆర్ఎస్ సర్కార్ కి ఒక నెల బాగుంటే రెండు నెలలు అగ్ని పరీక్షలు ఎదుర్కోవలసి వస్తోంది. కొన్ని రోజుల క్రితం వరకు మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూసేకరణకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల పోరాటాలు, జీవో:123, యూనివర్సిటీ వైస్-ఛాన్సిలర్ల నియామకంపై జారీ చేసిన జీవోలపై హైకోర్టులో మొట్టికాయలు తింటూ చాలా ఉక్కిరిబిక్కిరి అయ్యింది. కానీ వాటిపై ప్రభుత్వం చేపట్టిన చర్యల వలన హైకోర్టు, సుప్రీంకోర్టులో అనుకూలంగా తీర్పులు రావడంతో చాలా ఉపశమనం కలిగింది. కానీ మళ్ళీ జిల్లాల పునర్విభజన అనే తేనే తుట్టెని కదుపుకొని, ప్రతిపక్షాలతో యుద్ధం చేయవలసి వస్తోంది. జిల్లాల పునర్విభజనపై ఇంతవరకు 33,000 ఫిర్యాదులు అందడం గమనిస్తే, ఈ సమస్య తీవ్రత అర్ధం చేసుకోవచ్చు.

ఈ అంశంపై అధికార ప్రతిపక్షాలు మధ్య యుద్ధం కొనసాగుతుంటే, తెలంగాణ రాజకీయ జేఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఈరోజు మరో బాంబు పేల్చారు. రైతుల  సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 2వ తేదీన జేఏసి అధ్వర్యంలో గాంధీ సమాధి వద్ద మౌన దీక్ష చేపడతామని ప్రకటించారు. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి చేసేందుకు వేలాదిగా రైతులతో కలిసి త్వరలోనే ‘ఛలో హైదరాబాద్’ కార్యక్రమం చేపట్టబోతున్నట్లు ప్రకటించారు.

తెలంగాణ ప్రభుత్వం వివిధ రంగాలలో అభివృద్ధికి నూతన విధానాలు ప్రకటిస్తున్నట్లుగానే వ్యవసాయానికి కూడా నూతన విధానం ప్రకటించాలని ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. ఎన్నికలలో చెప్పినట్లుగా పంటరుణాలని మాఫీ చేయాలనీ కోరారు. వివిధ ప్రాజెక్టుల నిర్మాణం కోసం ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి తీసుకొంటున్న భూమికి బదులుగా నష్టపరిహారంతో బాటు వేరే ప్రాంతంలో సమానమైన భూమిని కూడా ఇవ్వాలని ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. శాసనసభలో ఒకరోజు పూర్తిగా రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితుల గురించి చర్చించడానికే కేటాయించాలని కోరారు. ఆ డిమాండ్ కి టిఆర్ఎస్ సర్కార్ కూడా ఎటువంటి అభ్యంతరం ఉండకపోవచ్చు.

కొన్ని రోజుల క్రితం ప్రొఫెసర్ కోదండరాం రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి గురించి తెలుసుకొనేందుకు జిల్లాల పర్యటనలు చేశారు. ఆ సందర్భంగా రైతుల సమస్యలు ఆయన దృష్టికి వచ్చిఉండవచ్చు. అందుకే ఆయన హఠాత్తుగా ఈ పోరాటానికి సిద్దం అవుతున్నారేమో?

అయితే టిఆర్ఎస్ సర్కార్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న అంశం వ్యవసాయమేనని అందరికీ తెలుసు. అందుకోసమే ప్రభుత్వం మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టులని చేపడుతోంది. కనుక ఈ విషయంలో ప్రభుత్వానికి ఆయన మరికొంత గడువు ఇస్తే బాగుంటుంది. ఆయన కూడా ప్రతిపక్షాలతో కలిసి ప్రభుత్వం ఈ విధంగా ఒత్తిడి తెస్తున్నట్లయితే, ఈ ఒత్తిళ్ళని తట్టుకోలేక టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలాగే మారిపోతే అప్పుడు అందరూ బాధపడవలసి వస్తుంది. టిఆర్ఎస్ సర్కార్ ని మిగిలిన విషయాలలో వేలెత్తి చూపవచ్చునేమో కానీ వ్యవసాయ రంగంలో వేలెత్తి చూపలేము. కనుక ఈ విషయంలో ప్రొఫెసర్ కోదండరాం దానిని వ్యతిరేకించే బదులు సహకరిస్తే బాగుంటుంది.