పక్కదారి పడుతున్న జిల్లాల పునర్విభజనపై చర్చలు

రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన గురించి అధికార, ప్రతిపక్షాల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వాటి వలన అసలు సమస్య పక్కదారి పట్టి ఇది అధికార ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న ఏదో యుద్ధం అన్నట్లుగా తయారైంది. దీనిపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చాలా తీవ్రంగా స్పందిస్తూ “ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం, ప్రతిపక్షాలకి కొన్ని పరిమితులు ఉంటాయి. కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి కెసిఆర్ ని ఏకవచనంతో సంభోదిస్తే చూస్తూ ఊరుకోము. జీవితాంతం ఇంకొకరి మోచేతి నీళ్ళు త్రాగి బ్రతికే కాంగ్రెస్ నేతలు కెసిఆర్ ని విమర్శిస్తే ప్రజలు వారి నాలుకలు చీరేస్తారు. అయినా వాళ్ళు ఏనాడైన రాష్ట్రాభివృద్ధి కోసం ఇటువంటి గొప్ప ఆలోచనలు చేశారా?” అని మంత్రి ప్రశ్నించారు.

ఆయన ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలని ఉద్దేశ్యించి దిక్కుమాలిన మొహాలు, ఇతరుల మోచేతి నీళ్ళు త్రాగి బ్రతికేవాళ్ళు అని వారిని ఈసడించుకొన్నారు. ప్రతిపక్షాలు మర్యాదగా మెలగాలని సూక్తులు చెపుతున్నప్పుడు ఆయన కూడా పద్ధతిగా మాట్లాడి ఉంటే బాగుండేది. ఆయనే కాదు ముఖ్యమంత్రి కెసిఆర్ తో సహా చాలా మంది మంత్రులు కాంగ్రెస్ నేతలని సన్నాసులని, టిడిపి నేతలని తెలంగాణ ద్రోహులని తీవ్ర విమర్శలు చేస్తుంటారు. గద్వాల్, జనగామలని జిల్లాలుగా ఏర్పాటు చేయాలని కోరుతూ ఇందిరా పార్క్ వద్ద రెండు రోజులు దీక్ష చేసిన డికె అరుణని నిజామాబాద్ ఎంపి ‘బొమ్మాళీ’ అని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నవారే ఈ విధంగా ప్రతిపక్షాల పట్ల చులకనగా మాట్లాడుతుంటే, ప్రతిపక్షాలు మడికట్టుకొని కూర్చోమంటే కూర్చోంటాయా? టిఆర్ఎస్ నేతలే ఆలోచించుకొంటే మంచిది.

ఒకప్పుడు టిఆర్ఎస్ తెలంగాణ ఉద్యమాలు చేస్తున్నప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై, ముఖ్యమంత్రులు, మంత్రులు, గవర్నర్, ప్రధాని డా. మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ తదీతరులపై వారు చాలా తీవ్రమైన విమర్శలే చేసేవారు. కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ నేతలు తమని విమర్శిస్తుంటే తట్టుకోలేక ఈ విధంగా  ఎదురుదాడి చేస్తున్నారు. అధికారంలో ఉన్నవారు సంయమనం పాటించడం చాలా అవసరం. అప్పుడే ప్రతిపక్ష పార్టీలకి కూడా సూక్తులు చెప్పే నైతిక అర్హత ఉంటుంది. ఇక్కడ సమస్య జిల్లాల పునర్విభజన తప్ప అధికార ప్రతిపక్షాల ఆధిపత్య పోరు కాదు కనుక అందరూ దానిలో లోటుపాట్ల గురించి మాత్రమే ఎక్కువగా చర్చిస్తే అందరూ హర్షిస్తారు.