ఎంపీ కవితకు కష్టాలు.. మాటలే తూటాలయ్యాయి

కొత్త జిల్లాల విష‌యంలో కాంగ్రెస్ చేస్తున్న డిమాండ్ల‌పై ఎంపీ క‌విత స్పందించిన విష‌యం తెలిసిందే. కాంగ్రెస్ నాయ‌కురాలు డీకే అరుణ‌ను బొమ్మాళీ అని అభివ‌ర్ణించారు! ఆ కామెంట్‌పై డీకే అరుణ రెస్పాండ్ అయ్యారు. తాను బొమ్మాళీ అయితే, కేసీఆర్ ప‌శుప‌తి అని కామెంట్ చేశారు. సో… కాంగ్రెస్‌తో ఇలా మాట‌ల యుద్ధం సాగుతుంటే… మ‌రో ప‌క్క భాజ‌పా కూడా క‌విత‌ను టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు చేశారు! సెప్టెంబ‌ర్ 17వ తేదీని తెలంగాణ విమోచ‌నా దినోత్స‌వాన్ని ప్ర‌భుత్వం అధికారికంగా నిర్వ‌హించాల‌ని భాజ‌పా డిమాండ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. భాజ‌పా డిమాండ్‌పై క‌విత ఫైర్ అయ్యారు. విమోచ‌నా దినోత్స‌వాల్లాంటివి అధికారికంగా నిర్వ‌హిస్తే హిందూ ముస్లింల మ‌ధ్య విభేదాలు త‌లెత్తే అవ‌కాశం ఉంద‌ని క‌విత వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇదే వ్యాఖ్య‌ల్ని త‌ప్పుబ‌ట్టారు భాజ‌పా సీనియ‌ర్ నాయకుడు ఇంద్ర‌సేనారెడ్డి.

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌రువాత విమోచ‌నా దినోత్స‌వాన్ని అధికార దినంగా జ‌రుపుతామ‌ని గ‌తంలో కేసీఆర్ ఇచ్చిన హామీని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఇంద్ర‌సేనారెడ్డి అన్నారు. ఈ మాట కేసీఆర్ ఉద్య‌మ స‌మ‌యంలో చెప్పార‌న్న విష‌యం క‌వితకు తెలియ‌దా అంటూ ఆయ‌న ప్ర‌శ్నించారు. ‘ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రోశ‌య్య ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు మీ నాయ‌న తొడ‌గొట్టి మ‌రీ ఇదే విషయం చెప్పిండు. విమోచ‌న దినోత్స‌వాన్ని పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేస్తామ‌ని చెప్పిండు’ అని ఇంద్ర‌సేనా వ్యాఖ్యానించారు. విమోచ‌నా దినోత్స‌వాన్ని చేయ‌డం వ‌ల్ల హిందూ ముస్లింల మ‌ధ్య గొడ‌వ‌లు పెరుగుతాయ‌ని క‌విత వ్యాఖ్యానించ‌డం క‌రెక్ట్ కాద‌ని ఆయ‌న అన్నారు.

ఎప్పుడూ మాట‌ల‌తో ఇత‌రుల‌ను ఇరుకున పెట్టే ఎంపీ క‌విత, ఇప్పుడు అదే మాట‌ల మ‌ధ్య‌లో ఇరుక్కుపోయిన ప‌రిస్థితి ఏర్ప‌డింద‌నే చెప్పాలి. ఎందుకంటే, విమోచ‌నా దినోత్స‌వాన్ని క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్రలు నిర్వ‌హిస్తున్నారు. ఆ రెండూ గ‌తంలో నిజాం రాష్ట్రంలో ఉండేవి క‌దా! ఆయా రాష్ట్రాల్లో విమోచ‌నా దినం జ‌రుగుతుంటే ఎలాంటి స‌మ‌స్య‌లూ రాన‌ప్పుడు, తెలంగాణ‌లో మాత్రం ఎందుకు వ‌స్తాయ‌న్న‌ది సూటి ప్ర‌శ్న‌. మ‌రి, ఈ ప్ర‌శ్న‌కు క‌విత ద‌గ్గ‌రున్న స‌మాధానం ఏంటో  చూడాలి.