తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఎన్నో సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. రెండు రాష్ట్రాల మధ్య జరగాల్సిన పంపకాలు చాలా ఉన్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రా సీఎం చంద్రబాబు… ఈ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే చాలు, చాలా సమస్యలకు పరిష్కార మార్గాలు లభిస్తాయి. అయితే, అలాంటి భేటీకి ఆస్కారం ఉండటం లేదు! ఇద్దరు ముఖ్యమంత్రులనీ ఒక చోట కూర్చోబెట్టి, సమస్యలపై చర్చించే చొరవ గవర్నర్ తీసుకోవడం లేదు! ఈ మధ్య రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారిన ప్రధానాంశం… జల వివాదం. గతంలో ఇదే అంశమై రెండు రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపించాలని కేంద్రం ప్రయత్నించింది. ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులను కేంద్రమంత్రి ఉమాభారతి చర్చలకు ఆహ్వానించారు. మంత్రుల స్థాయిలోనే జల వివాదాలకు ముగింపు పలకాలనుకున్నారు. కానీ, ఇరు రాష్ట్రాల మంత్రులూ అర్ధంతరంగా ఆ సమావేశం నుంచి వైదొలగడంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోయాయి. అయితే, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చలు జరిపి, సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం మరోసారి ప్రయత్నిస్తోంది.
పాలమూరు, రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకాలకు సంబంధించి చర్చించేందుకు ఢిల్లీ రావాల్సిందిగా ఇద్దరు ముఖ్యమంత్రులనూ కేంద్రమంత్రి ఉమాభారతి ఆహ్వానిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించేందుకు ఉమా భారతి చొరవ తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. కేసీఆర్, చంద్రబాబులను ఈ నెల 11, 18, 19 తేదీల్లో ఇద్దరికీ అనుకూలంగా ఉన్న రోజున సమావేశానికి రావాలని కోరుతూ లేఖలు పంపారు. ఇద్దరు సీఎంలకూ ఆమోదయోగ్యమైన తేదీని వారే నిర్ణయించుకోవాలని కోరడం విశేషం.
అయతే, ఇప్పటికైనా రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న జల జగడాలకు ఇక్కడితో ఒక శాశ్వత పరిష్కారం దొరకాలని ప్రజలు ఆశిస్తున్నారు. గతంలో జల జగడాలు ముదిరి, నాగార్జున సాగర్ వద్ద రెండు రాష్ట్రాలకు చెందిన పోలీసులు బాహాబాహీకి దిగిన సందర్భం ఉంది. ఆ సమయంలో ఇద్దరు సీఎంలూ భేటీ అయ్యారు. ఆ తరువాత, సమస్యల పరిష్కారం దిశగా ఇద్దరు ముఖ్యమంత్రులూ కలుసుకున్న దాఖలాలే లేవు. ఇటీవల గవర్నర్ ఇచ్చిన విందుకు ఇద్దరు సీఎంలు వచ్చినా కూడా.. హాయ్ బాయ్ అని పలకరింపులకు మాత్రమే పరిమితమయ్యారు. ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో ఏదో ఒక శాశ్వత పరిష్కారం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.