కనువిందు చేస్తున్న ఖైరతాబాద్ మహా గణేషుడు

ఖైరతాబాద్ లో కొలువుతీరిన శ్రీ శక్తిపీట శివనాగేంద్ర గణపతికి గవర్నర్ దంపతులు తొలిపూజ నిర్వహించారు. రాజ్ భవన్ నుంచి మండపం వద్దకు చేరుకున్న గవర్నర్ నరసింహన్ దంపతులకు మంత్రి తలసాని, ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు వేదమంత్రాల మధ్య మహా గణపతికి తొలిపూజ నిర్వహించారు. వివిధ ప్రాంతాలనుంచి భక్తులు తరలి రావడంతో ఖైరతాబాద్ పరిసరాలు జనసంద్రాన్ని తలపిస్తున్నాయి. వక్రతుండ మహా గణపతుడికి తొలి పూజ అనంతరం గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ అందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. వినాయకుడిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలిగిపోతాయని పేర్కొన్నారు. 

ఖైరతాబాద్ గణేషుడు ఈ సారి శ్రీ శక్తిపీట శివనాగేంద్ర మహా గణపతి రూపంలో భక్తులకు దర్శనిమిస్తున్నాడు. అటు ఖైరతాబాద్ విగ్రహం 58 అడుగుల పొడవు, 28 అడుగుల వెడల్పుతో రూపొందించారు. 40నుంచి 45 టన్నులు ఉన్న ఈ విగ్రహానికి 60 లక్షల రూపాయలు ఖర్చుచేశారు. ఇక ఈ సారి తెలంగాణ ప్రభుత్వం భద్రతా రీత్యా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 200 మీటర్ల వరకు సీసీ కెమెరాలు,  సుమారు 100 మంది పోలీసుల బందోబస్తు. 25 మంది ఎస్సైలు, 3 ఇన్ స్పెక్టర్లు, 1డిఎస్పీ తోపాటు 100 మంది వాలంటీర్లు మరియు ప్రయివేటు సెక్యూరిటీ ని ఏర్పాటు చేశారు.