టిఆర్ఎస్ సర్కార్ ప ై రేవంత్ రెడ్డి ఫైర్

రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన ప్రక్రియపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు, ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం అవి లేవనెత్తుతున్న సమస్యలపై వాటితో చర్చించే ప్రయత్నం చేయకుండా, బొమ్మాళి, సన్నాసులు, తెలంగాణా ద్రోహులు అంటూ వాటిపై ఎదురుదాడి చేస్తుండటంతో ప్రతిపక్షాలు కూడా అంతే ధీటుగా బదులిస్తున్నాయి.

తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అయితే మరో అడుగు ముందుకు వేసి “టిఆర్ఎస్ జెండా దిమ్మెలని కూల్చి, టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపండి” అని వివిధ జిల్లాలలోఆందోళనలు చేస్తున్న ఉద్యమకారులకి పిలుపునిచ్చారు. అది కొంచెం తీవ్రమైన అభిప్రాయమే కానీ అటువంటి ఆలోచనలకి అవకాశం కల్పించింది మాత్రం టిఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పకతప్పదు.

జిల్లాల పునర్విభజనపై రాష్ట్రంలో ఇన్ని ఆందోళనలు జరుగుతున్నప్పుడు, సుమారు 30,000 సూచనలు, సలహాలు, పిర్యాదులతో కూడిన అర్జీలు వచ్చినప్పుడు, ప్రతిపక్షాలు ఇంతగా వ్యతిరేకిస్తున్నప్పుడు ప్రతిపక్షాలతో అఖిలపక్ష సమావేశాలుశం నిర్వహించి ఉండి ఉంటే పరిస్థితులు ఇంత జటిలం అయ్యుండేవి కావేమో. కానీ టిఆర్ఎస్ సర్కార్ ఏమాత్రం వెనకడుగు వేయకుండా ప్రతిపక్షాలపై ఎదురుదాడికి పూనుకోవడంతో గోటితో పోయే సమస్య కాస్తా గొడ్డలి వరకు వెళ్ళింది. దాని ఉద్దేశ్యం మంచిదే అయినప్పటికీ, దానిని అమలు చేసే విధానమే సరిగ్గా లేకపోవడంతో చేజేతులా సమస్యలు సృష్టించుకొన్నట్లయింది.

రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “టిఆర్ఎస్ సర్కార్ ఏకపక్షంగా, నిరంకుశంగా వ్యవహరిస్తోంది. వరంగల్ జిల్లాని విభజించవద్దని అందరూ హెచ్చరిస్తున్నా దానికే మొగ్గు చూపుతుండటంతో వరంగల్-హన్మకొండ ప్రాంతాల ప్రజల మధ్య చిచ్చు పెట్టినట్లయింది. అదేవిధంగా జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు పునర్విభజన కారణంగా మిగిలిన ప్రాంతాలలో ప్రజల మధ్య కూడా చిచ్చు రగిల్చింది.”

“జంట నగరాలుగా ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్ లను ఒకే జిల్లాగా ఏర్పాటు చేయాలనుకొంటున్న టిఆర్ఎస్ సర్కార్, ఒకే జిల్లాగా ఉన్న వరంగల్, హన్మకొండ జంట నగరాలని రెండు జిల్లాలుగా ఎందుకు విడదీయాలనుకొంటోంది?” అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

“హన్మకొండ, శంషాబాద్ లని జిల్లాలుగా చేయమని ఎవరూ ఉద్యమం చేయలేదు కానీ వాటిని టిఆర్ఎస్ సర్కార్ విడదీయాలని చూస్తోంది. గద్వాల్, జనగామలని జిల్లాలుగా చేయాలని ప్రజలు ఉద్యమిస్తుంటే అందుకు అంగీకరించడం లేదు. ఎన్నికల సమయంలో జనగామని జిల్లాగా ఏర్పాటు చేస్తానని కెసిఆర్ హామీ ఇచ్చిన సంగతి మరిచిపోయారా? ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ప్రజాగ్రహానికి ఎందుకు గురవుతున్నారు? ప్రజల జీవితాలతో ఈవిధంగా ఆడుకొంటున్న కెసిఆర్, ఆయన కుటుంబ సభ్యులు, టిఆర్ఎస్ నేతలు పోలీస్ రక్షణ లేకుండా తెలంగాణాలో స్వేచ్చగా తిరగగలరా?” అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి ప్రశ్నలు, విమర్శలు కొంచెం ఘాటుగా కనిపిస్తున్నప్పటికీ, అవి ప్రజాభిప్రాయానికి అద్దం పడుతున్నాయని చెప్పవచ్చు. టిఆర్ఎస్ కి అధికారం కట్టబెడితే రాష్ట్రాభివృద్ధి చేస్తుందని ఆశిస్తే, ఇటువంటి రకరకాల ప్రయోగాలతో ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించుకొని తాను ఇబ్బంది పడుతూ, ప్రజలని కూడా ఇబ్బందులు పెడుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.