దేశ ప్రజలలో జాతీయ భావం పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా తిరంగా (మువ్వన్నెల జెండా) యాత్రలు నిర్వహిస్తోంది. ఈరోజు హైదరాబాద్ లో కేబిఆర్ పార్క్ నుంచి జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్ చౌరస్తా, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి మీదుగా మళ్ళీ కేబీఆర్ పార్క్ వరకు ఈ యాత్ర సాగింది. ఇందులో కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్, మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తదీతరులు చాలా మంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు తన సహశైలిలో అనర్గళంగా ఉపన్యాసం ఇచ్చారు. సుమారు అరగంటకి పైగా ఆయన మాట్లాడిన మాటల సారాంశం ఏమిటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ కారణంగానే దేశం సమైక్యంగా ఉంది. ఆయనకే కాశ్మీర్ అంశం అప్పగించి ఉంటే నేడు కాశ్మీర్ సమస్య ఉండేదే కాదు. దేశంకోసం అనేకమంది మహనీయులు పోరాడారు. కులం, మతం పేరిట రాజకీయాలు చేస్తున్న పార్టీలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.
ప్రజలలో జాతీయ భావం పెంపొందించాలానే ఆలోచన చాలా మంచిదే. అయితే దాని కోసం కేంద్రమంత్రులు రోడ్లమీద ఈ విధంగా జెండాలు పట్టుకొని తిరగడం వలన ఆశించిన ఫలితం రాదు. ట్రాఫిక్ జామ్ అవుతుంది. అప్పుడు ప్రజలు తిట్టుకొంటారు. దేశభక్తి రెడీమేడ్ గా సృష్టించగలిగే వస్తువు కాదు. దానిని ఉగ్గుపాల నుంచే అలవాటు చేయాలి. పిల్లలకి, యువతకి దేశభక్తి లెసన్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు, పెద్దలు కూడా ఆవిధంగా వ్యవహరించినప్పుడే పిల్లలు ఆ మాటలని నమ్ముతారు.
ఏ రాజకీయ పార్టీ, వాటి నేతలు తమకి ప్రయోజనం లేనిదే ఏ పని చేయరనే సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాము నిర్వహిస్తున్న ఈ తిరంగా యాత్రకి ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవని భాజపా నేతలు చెపుతున్నప్పటికీ, ఇది భాజపా తనని తాను ప్రమోట్ చేసుకొనే ప్రయత్నంగానే చెప్పవచ్చు. తెరాస ఎంపి కవిత ఈ యాత్రపై స్పందిస్తూ వెంకయ్య నాయుడు హిందూ, ముస్లింల మధ్య చీలిక తెచ్చేవిధంగా మాట్లాడారని విమర్శించడం గమనిస్తే, ఈ యాత్రలు ఓటు బ్యాంక్ యాత్రలని అర్ధం అవుతుంది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మహాత్మా గాంధీ, నెహ్రూల వలనే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నట్లు మాట్లాడేది. భాజపా అధికారంలోకి వచ్చిన తరువాత నెహ్రూ కంటే పటేల్ గొప్పవాడు అని నిరూపించే ప్రయత్నంలో పడింది. అందుకోసం గుజరాత్ ప్రభుత్వం సుమారు 2,500 కోట్లు ఖర్చు చేసి దేశంలోకెల్లా అతిపెద్ద పటేల్ విగ్రహం ఏర్పాటు చేస్తోంది. ఆనాడు స్వాతంత్ర్యం కోసం పోరాడిన నేతలెవరూ మున్ముందు ఇటువంటి పరిస్థితులు వస్తాయని ఊహించి ఉండరు. వారికి తెలిసిందల్లా ఒకటే నిఖార్సయిన దేశభక్తి. ఇప్పుడు ప్రజలలో దేశభక్తిని పెంచుతామని పనిగట్టుకొని తిరుగుతున్న నేతలు ఆ దేశభక్తులని కూడా విడదీసి వారిలో ఎవరు చాలా గొప్ప మహానుభావులో ఎవరు కొంచెం తక్కువ మహానుభావులో డిసైడ్ చేసి ప్రజలకి చూపిస్తున్నారు. ఇదేనా వారు చేసే నిర్వాకం?