అరుణ, పొన్నాల దీక్షలు దేనికోసమో?

మాజీ మంత్రులు డికె అరుణ, పొన్నాల లక్ష్మయ్య నేటి నుంచి ఇందిరా పార్క్ వద్ద 48 గంటలు నిరాహార దీక్షకి కూర్చొన్నారు. తెలంగాణ ప్రభుత్వం జిల్లాలని చాలా అశాస్త్రీయంగా, ఏకపక్షంగా ఏర్పాటు చేస్తోందని వారు ఆరోపిస్తున్నారు. గద్వాల్, జనగామ జిల్లాలని ఏర్పాటు చేయాలని, వరంగల్ ని రెండుగా విభజించవద్దని వారు డిమాండ్ చేస్తున్నారు. భౌగోళిక పరిస్థితులు, జనాభా, వనరులు, పరిపాలనా సౌలభ్యం వంటి అంశాల ఆధారంగా శాస్త్రీయంగా జిల్లాల పునర్విభజన చేయవలసి ఉండగా, టిఆర్ఎస్ తన రాజకీయ లబ్ది కలిగే విధంగా జిల్లాల పునర్విభజన చేస్తోందని అరుణ ఆరోపించారు. అఖిలపక్ష సమావేశంలో తమ పార్టీ ఇచ్చిన సూచనలని పట్టించుకోకుండా టిఆర్ఎస్ సర్కార్ తనకు నచ్చినట్లు ఏకపక్షంగా జిల్లాల విభజన చేస్తోందని అరుణ విమర్శించారు.

టిఆర్ఎస్ సర్కార్ తన పార్టీకి మేలుకలిగే విధంగా జిల్లాల పునర్విభజన చేస్తోందని ఆరోపిస్తున్న అరుణ, పొన్నాల కూడా తమకి రాజకీయంగా లబ్ది కలగాలనే గద్వాల్, జనగామలని జిల్లాలుగా చేయాలని కోరుతూ ఈ దీక్షకి కూర్చున్నారు. జిల్లాల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మాత్రమే విడుదల చేసింది తప్ప తుది నోటిఫికేషన్ కాదు. ఒకవేళ ప్రభుత్వ ప్రతిపాదనలపై వారికి ఏమైనా అభ్యంతరాలున్నట్లయితే ఈ నెలరోజులలోగా జిల్లా కలెక్టర్లకి లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందజేయవచ్చు. ఇంకా ఒత్తిడి తేదలచుకొంటే గద్వాల్, జనగామ ప్రాంతాలలో ప్రజల చేత కూడా లిఖితపూర్వకంగా కలెక్టర్లకి అర్జీలు పెట్టించవచ్చు. ఒకవేళ వాటిని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ లో ప్రతిపాదించిన విధంగా ఏకపక్షంగా జిల్లాలని ఏర్పాటు చేసినట్లయితే అప్పుడు ప్రభుత్వానికి తమ నిరసన తెలిపేందుకు అరుణ, పొన్నాల దీక్షలకి కూర్చున్నా అర్ధం ఉంటుంది.

ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోకముందే వారిరువురూ నిరాహార దీక్షకి కూర్చోవడం ద్వారా ప్రభుత్వంపై తప్పకుండా ఒత్తిడి పెరుగుతుంది. కానీ టిఆర్ఎస్ సర్కార్ ఇటువంటి ఒత్తిళ్ళకి లొంగిపోయే మాటయితే మరో 50 జిల్లాలు ఏర్పాటు చేయవలసి ఉంటుంది. అరుణ, పొన్నాల నిజంగానే ప్రజల అభీష్టం మేరకే దీక్షకి కూర్చొని ఉండవచ్చు కానీ ప్రజలు, టిఆర్ఎస్ సర్కార్ వేరేలా భావించే అవకాశాలే ఎక్కువ. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగువెలిగిన వారిద్దరూ, టిఆర్ఎస్ ప్రభావం వలన తమ ఉనికిని కోల్పోయే పరిస్థితిలో ఉన్నారు. అందుకే వారిద్దరూ తమ ఉనికిని చాటుకోవడానికే ఈ సాకుతో దీక్షలు చేస్తున్నారని తెరాస ఆరోపిస్తోంది. జిల్లాల పునర్విభజన గురించి వారు ప్రభుత్వానికి ఏమైనా సలహాలు, సూచనలు ఇస్తే ఇవ్వాలని, కానీ ఈ విధంగా దీక్షలు చేయడం తగదని టిఆర్ఎస్ నేతలు అంటున్నారు. నిజమే కదా!