స్కిల్ డెవలప్ మెంట్ తో ‘జాగృతి’ కావాలి

తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న విద్యా వ్యాపారంపై రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యా వ్యవస్థ లోపభూయిష్టంగా ఉందని, చదువుల తల్లి సరస్వతిని లక్ష్మీగా  మారుస్తున్నారని ఆయన అన్నారు.  దేశ విద్యా వ్యవస్థలో మార్పు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. విద్యలో స్కిల్స్ ఉండాలని అన్నారు. ఇంజినీరింగ్ పాసైన విద్యార్థులు బంట్రోతు ఉద్యోగానికి ధరఖాస్తు చేసుకుంటున్నారని, ఇంతకన్నా దురదృష్టం మరొకటిలేదని అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ లేకపోతే మేకిన్ ఇండియా తయారు కాదని, జాగృతి సంస్థ సమాజం మొత్తాన్ని జాగృతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. 

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లను నిజామాబాద్ ఎంపీ కవిత గవర్నర్ నరసింహన్ తో కలిసి ప్రారంభించారు. స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లలో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికేట్లు ఇవ్వనున్నామని, అలాగే చాలా కంపెనీలతో ఒప్పందం కుదిరిన కారణంగా ఉద్యోగాల కల్పనకు కూడా ఆస్కారం ఉందని కవిత వెల్లడించారు. తెలంగాణ జాగృతితో కలిసి యువత జాతి నిర్మాణంలో, బంగారు తెలంగాణ సాధనలోనూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.