సాగునీటి ప్రాజెక్టులలో అవినీతి జరుగుతూనే ఉందా?

సాగునీటి ప్రాజెక్టులలో భారీ అవినీతి జరుగుతోందని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతూనే ఉన్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని తేలికగా కొట్టిపడేస్తోంది. కానీ పాలమూరు ప్రాజెక్టులో అవీనితికి పాల్పడినందుకు నరేందర్ రెడ్డి, నరసింహ అనే ఇద్దరు సూపరిండెంట్ ఇంజీర్లని విధుల నుంచి తప్పించి ఈ.ఎన్.సి. కార్యాలయానికి గురువారం సరెండర్ చేసింది. ఇదే కేసులో చీఫ్ ఇంజనీరుకి కూడా నోటీస్ ఇచ్చి సంజాయిషీ కోరింది.

పాలమూరు ప్రాజెక్టు పనులలో భాగంగా పిల్ల కాలువల సర్వే కోసం టెండర్లు పిలిచినప్పుడు వారు సాంకేతిక కారణాలు చూపుతూ 12 సంస్థల బిడ్లని తిరస్కరించారు. అందులో చాలా పొరపాట్లు జరిగాయని గుర్తించిన కమీషనర్ ఆఫ్ టెండర్స్, ఆ టెండర్స్ అన్నిటినీ రద్దు చేసి మళ్ళీ మరోమారు టెండర్లు పిలిస్తే అప్పుడు కూడా వారిద్దరూ అదే విధంగా అర్హతలేని కొన్ని సంస్థలకి పనులు కట్టబెట్టే ప్రయత్నం చేశారు. మళ్ళీ ఆ టెండర్లని కూడా రద్దు చేసి దర్యాప్తు జరిపించగా వారిద్దరే బాధ్యులని తేలడంతో వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకొంది. మిషన్ కాకతీయలో కూడా అవినీతి ఆరోపణల కారణంగా ఐదుగురు ఇంజనీర్లని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

అయితే ఈ అవినీతి ఇంజనీర్ల స్థాయిలో జరుగుతున్నదే తప్ప ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు మంత్రుల స్థాయిలో జరుగుతున్నది కాదు. కొందరు తెరాస నేతలు, వారి అనుచరులకి చెందిన కొన్ని సంస్థలు ఈ సాగునీటి కాంట్రాక్ట్ పనులని చేజిక్కించుకొని జేబులు నింపుకొంటున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వారి  మరో ప్రధాన ఆరోపణ ఏమిటంటే, కెసిఆర్ కి సన్నిహితులైన ఆంధ్రా కాంట్రాక్టర్లు కూడా ఈ ప్రాజెక్టు పనులు దక్కించుకొని జేబులు నింపుకొంటున్నారని! 

పాలమూరు ప్రాజెక్టుని వ్యతిరేకిస్తూ కర్నూలులో రెండు రోజులు నిరాహార దీక్ష చేసిన వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆ ప్రాజెక్టులో తమ పార్టీ నేత ఒకరు కాంట్రాక్టు పనులు దక్కించుకొన్నారని చెప్పారు కూడా. కనుక, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా ఇంజనీర్ల స్థాయి నుంచి పైస్థాయి వరకు ప్రాజెక్టు పనులలలో ఎంతో కొంత అవినీతి జరుగుతున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి.

ఈ సాగునీటి ప్రాజెక్టులని చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టిఆర్ఎస్ సర్కార్ వాటిలో అవినీతిపై ఉక్కుపాదం మోపకపోతే, ఆనాడు స్వర్గీయ రాజశేఖ రెడ్డి చేపట్టిన జలయజ్ఞం కాస్తా చివరికి ధన యజ్ఞంగా మారినట్లే ఈ ప్రాజెక్టులు కూడా టిఆర్ఎస్ పార్టీకి మాయని మచ్చని మిగిల్చే ప్రమాదం ఉంది.