ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి హైకోర్టులో ఊరట లభించింది. ఓటుకి నోటు కేసులో ఏసిబి తనపై విచారణ నిలిపివేయాలన్న బాబు అభ్యర్ధనని హైకోర్టు మన్నించి స్టే మంజూరు చేసింది. ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న వైకాపా ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి, తెలంగాణ ఏసిబికి 8వారాలలోగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించింది. కనుక అంతవరకు తెలంగాణ ఏసిబి అధికారులు చంద్రబాబు జోలికి రాలేరు. కానీ ఏసిబి కోర్టులో సెప్టెంబర్ 29న జరిగే ఈ కేసు విచారణకి నిందితులుగా పేర్కొనబడిన రేవంత్ రెడ్డి తదితరులు హాజరుకాక తప్పదు. ఒకవేళ వారు కూడా హైకోర్టుని ఆశ్రయించి స్టే పొందితే విచారణ నిలిచిపోయే అవకాశం ఉంది.
ఈ కేసుని మళ్ళీ కదిపిన రామకృష్ణా రెడ్డి హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో సవాలు చేస్తానని చెప్పారు. కనుక చంద్రబాబు నాయుడు మళ్ళీ దానికి సిద్ధం కావలసి ఉంటుంది. అయితే చంద్రబాబుకి తెలంగాణకి చెందిన ఏసిబి కోర్టులో కేసులని ఎదుర్కోవడం కంటే హైకోర్టు, సుప్రీంకోర్టులలో కేసులు ఎదుర్కోగల నేర్పు, పలుకుబడి ఉన్నవారే కనుక సుప్రీంకోర్టులో కూడా ఆయన చాలా తేలికగానే బయటపడవచ్చు. అయితే ఈ కేసుని ఆయన ఎదుర్కొనే ఉద్దేశం లేదు కనుక అది ఆయన జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. మళ్ళీ ఏదో ఒకరోజు ఎవరో ఒకరు ఇదే విధంగా ఈ కేసుని కదుపుతూనే ఉంటారు కనుక చంద్రబాబు నాయుడు అందుకు మానసికంగా సిద్ధం అయ్యి ఉండక తప్పదు.
ఈ కేసులో స్టే కోరుతూ హైకోర్టుని ఆశ్రయించడం ద్వారా అయన తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు స్వయంగా బయటపెట్టుకొన్నారు. అదే విధంగా ప్రతిపక్షాల నుంచి విమర్శలు కూడా ఎదుర్కోవలసివస్తోంది. ఈ కేసుతో సంబంధం లేదని, అసలు తనపై ఎటువంటి కేసులు లేవని, తాను ఎవరికీ భయపడనని చంద్రబాబు నాయుడు చెపుతున్నప్పుడు మరి స్టే కోసం హైకోర్టుకి ఎందుకు వెళ్ళారు. ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా న్యాయవాదులని ఎందుకు రప్పించుకొన్నారు? అనే ప్రతిపక్షాల ప్రశ్నలకి ఆయన వద్ద సరైన సమాధానాలు లేవు.