తెలంగాణలో పోలీసులు జరిపిన ఎన్ కౌంటర్ లో హతమైన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ నయీం కేసును దర్యాప్తు చేస్తున్న సిట్... రోజుకో కొత్త విషయాన్ని వెలుగులోకి తీసుకొస్తుంటే... సిట్ కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన అంశం బయటకు రావడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సీనియర్ ఐపీఎస్ నాగిరెడ్డి అధ్వర్యంలో నయీం కేసు దర్యాప్తు కోసం సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)ను ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం... సిట్ ఆధ్వర్యంలోనే ఈ కేసు దర్యాప్తు జరుగుతుందని తేల్చి చెప్పింది. కొందరు ఈ కేసును సిట్టింగ్ జడ్జి, మరికొందరు కేసును సీబీఐకు అప్పగించాలని డిమాండ్ చేసినా... తెలంగాణ ప్రభుత్వం మాత్రం నయీం కేసును సిట్ మాత్రమే విచారిస్తుందని స్పష్టత ఇచ్చింది.
అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ లోనూ నయీంతో సంబంధాలు నడిపిన ఓ పోలీసు అధికారికి చోటు దక్కిందనే ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయాన్ని సిట్ అధికారులు, ప్రభుత్వం కూడా ఆలస్యంగా గుర్తించిందని... గుర్తించిన వెంటనే ఆ అధికారిని సిట్ నుంచి తొలగించి మరో అధికారికి అందులో చోటు కల్పించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే... ఆ అధికారి ఎవరనే విషయాన్ని మాత్రం ప్రభుత్వం గోప్యంగా ఉంచుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం బయటకు పొక్కకుండా తెలంగాణ ప్రభుత్వం జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నట్టు సమాచారం. ఏదేమైనా... నయీం కేసు విచారణ పూర్తయ్యే సరికి ఇలాంటి మైండ్ బ్లాకయ్యే అంశాలు ఇంకెన్ని వెలుగులోకి వస్తాయో చూడాలి.