ఓటుకి నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కూడా విచారించి సెప్టెంబర్ 29లోగా దర్యాప్తు నివేదికని సమర్పించవలసిందిగా తెలంగాణ ఏసిబి కోర్టు సోమవారం ఏసిబిని ఆదేశించడంతో చంద్రబాబు నాయుడు అప్రమత్తం అయ్యారు. ఈరోజు మధ్యాహ్నం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఏసిబి విచారణని నిలిపివేయాలని దానిలో కోరారు. భోజన విరామం తరువాత ఆ పిటిషన్ పై విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఒకవేళ హైకోర్టు ఏసిబి ఆదేశాలపై స్టే మంజూరు చేసినట్లయితే, ఇక ఈ కేసులో ముందుకు సాగదలచుకొన్నవారు తప్పనిసరిగా సుప్రీంకోర్టుకి వెళ్ళవలసి ఉంటుంది. కానీ హైకోర్టు స్టే మంజూరు చేయకపోతే మాత్రం చంద్రబాబు నాయుడు చాలా ఇబ్బందుల్లో పడతారు. అప్పుడు ఏసిబి దర్యాప్తును ఆయనే స్వయంగా ముందుకు జరుపుకొన్నట్లవుతుంది కనుక ఆయనే సుప్రీంకోర్టుని ఆశ్రయించవలసి వస్తుంది.
ఈ కేసులో ప్రధాన ముద్దాయిలుగా ఉన్న రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ సింహ ముగ్గురినీ సెప్టెంబర్ 29న ఏసిబి కోర్టుకి హాజరు కావలసిందిగా కోర్టు ఆదేశించింది. ఒకవేళ చంద్రబాబు నాయుడుకి ఈ కేసులో హైకోర్టు స్టే మంజూరు చేసినట్లయితే వారు ముగ్గురూ కూడా హైకోర్టుని ఆశ్రయించి స్టే పొందే ప్రయత్నం చేయవచ్చు.
రాష్ట్ర ప్రజలందరికీ మార్గదర్శిగా ఉండవలసిన ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇటువంటి ఆరోపణలు ఎదుర్కోవడం, స్టే కోసం కోర్టులని ఆశ్రయించవలసి రావడం చాలా అప్రదిష్టకరమైన విషయమే. కానీ మన రాజకీయ నేతలు ఇటువంటి అవమానాలకు అతీతులుగా మారిపోయారు కనుక వారు దేనికీ భయపడటం లేదు. కనీసం సిగ్గు పడటం లేదు. ఈ కేసు నుంచి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఏదో విధంగా బయటపడవచ్చు కానీ వారిపై పడిన ఈ మరక ఎన్నటికీ చెరిగిపోయే అవకాశం లేదు.