ఓటుకి నోటు కేసు మొదటిసారి బయటపడినప్పుడు టిడిపి-టిఆర్ఎస్ ప్రభుత్వాల మధ్య యుద్ధం సాగింది. కానీ ఇప్పుడు అది టిడిపి-వైసిపిల మధ్య యుద్ధంగా మారింది. ఇది మొదలయ్యి అప్పుడే 5 రోజులు కావస్తున్నా ఇంతవరకు టిఆర్ఎస్ నేతలు, మంత్రులు ఈ కేసు గురించి మాట్లాడలేదు. మరో విశేషం ఏమిటంటే, ఈ కేసు గురించి వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇంతవరకు మాట్లాడలేదు. అదే విధంగా ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న రేవంత్ రెడ్డికి సమన్లు జారీ అయినప్పటికీ ఆయన కూడా ఇంతవరకు ఈ కేసు గురించి మాట్లాడకపోవడం మరో విశేషం
టిఆర్ఎస్ నేతలు కలుగజేసుకోకపోవడంతో టిడిపి నేతలు, మంత్రులు ఈ కేసుని కెలికిన వైసిపి నేతలపైన, ఏసిబి కోర్టుపైనా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ కేసు గురించి టిడిపి నేతల చేతనే వీలైనంత ఎక్కువగా మాట్లాడించి వారి వేళ్ళతోనే వారి కళ్ళు పొడుచుకొనేలా చేయాలని వైసిపి కూడా కోరుకొంటోంది కనుక ఆ పార్టీ నేతలు, వారి సాక్షి మీడియా కూడా ఈ కేసు గురించి, దానిలో చంద్రబాబు నాయుడు పాత్ర గురించి గట్టిగానే మాట్లాడుతున్నారు. వైకాపా నేత ధర్మాన ప్రసాదరావు మరొక అడుగు ముందుకు వేసి ఈ కేసు పరిష్కారం అయ్యే వరకు చంద్రబాబు నాయుడు తన పదవికి దూరంగా ఉంటే మంచిదని సలహా ఇచ్చారు. ఈ నెలాఖరులోగా చంద్రబాబు నాయుడుకి ఏసిబి అధికారులు స్వర పరీక్ష చేయడం ఖాయమని సాక్షి జోస్యం చెపుతుంటే, ఆ తరువాత ఆయన జైలుకి వెళ్ళడం కూడా ఖాయమన్నట్లు వైసిపి నేతలు జోస్యం చెపుతున్నారు. టిడిపిని, చంద్రబాబుని మళ్ళీ గట్టిగా దెబ్బ తీయగలిగామనే సంతృప్తి, ఆనందం వారి మాటలలో స్పష్టంగా కనబడుతోంది.
ఈ కేసులో దాఖలు చేసిన ఎఫ్.ఐ.ఆర్.లో కానీ ఛార్జ్ షీట్లో గానీ చంద్రబాబు పేరు లేకపోయినా పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన ఆయనని ప్రశ్నించేందుకు ఏసిబి అధికారులని ఏసిబి న్యాయస్థానం అనుమతించడం రాజ్యాంగ వ్యతిరేకమని, తన పరిధిని అతిక్రమించినట్లేనని టిడిపి ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వాదించారు.
ఈసారి ఈ కేసుకి టిఆర్ఎస్ ప్రభుత్వం దూరంగా ఉండటం ఒక్కటే చంద్రబాబుకి చాలా ఊరట నిచ్చే విషయంగా చెప్పుకోవచ్చు. కనుక ఆయనే తన పలుకుబడిని, తెలివితేటలని, కేసులో సోమిరెడ్డి చెపుతున్నటివంటి సాంకేతికపరమైన లొసుగులతో బయటపడే ప్రయత్నం చేస్తారేమో? బహుశః ఆయనకి సహాయపడేందుకే కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఏపికి ప్రత్యేక ప్యాకేజి విషయం గురించి చర్చించే సాకుతో హైదరాబాద్ లో వాలిపోయారు. గతంలో కూడా ఆయనే చొరవ తీసుకొని చంద్రబాబుని బయటపడేశారు కనుక ఇప్పుడూ మళ్ళీ ఆయనే ఏదో ఒక ఉపాయంతో చంద్రబాబుని ఈ కష్టం నుంచి గట్టెక్కించే ప్రయత్నం చేయవచ్చు.
సెప్టెంబర్ 29న ఈ కేసుపై విచారణ కోర్టులో విచారణ జరిగేలోగా ఏమైనా జరుగవచ్చు. కానీ వైసిపి కలలు కంటున్నట్లుగా చంద్రబాబు తన పదవికి రాజీనామా చేయరు. ఈ కేసులో జైలుకి వెళ్లరు. టిడిపి ప్రభుత్వం పడిపోదు. మధ్యంతర ఎన్నికలు రావని ఖచ్చితంగా చెప్పవచ్చు. కానీ టిడిపిని ఆ మాత్రం ఇబ్బంది పెట్టగలిగినందుకు వైసిపి దాని అధినేత జగన్మోహన్ రెడ్డి మనసులో చాలా సంతోషపడవచ్చు.