కరీంనగర్ జిల్లా జైలు వద్ద ఒక పోలీస్ పూర్తిగా సహనం కోల్పోయాడు. తెలుగుదేశం నాయకులపై తుపాకి ఎక్కుపెట్టి తీవ్రంగా హెచ్చరించాడు. బస్తీమేసవాల్ లా రెచ్చిపోయాడు. కరీంనగర్ జైల్లో ఉన్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరామారావు ను కలిసేందుకు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు ఒంటేరు ప్రతాప్ రెడ్డి తో పాటు టీడీపీ నాయకులు వెళ్లారు. ఇదిలా ఉంటే లోపలికి రేవంత్ రెడ్డి, ప్రతాప్ రెడ్డిని మాత్రమే పంపించడంతో, బయట ఉన్న టీడీపీ నాయకులు కూడా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు.
అయితే అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిని తోసుకుంటూ లోపలికి వెళ్లబోగా పోలీసులకు టీడీపీ నాయకులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. అయితే అందులో ఒక పోలీసు అధికారి తీవ్రంగా ఉగ్రరూపం దాల్చాడు. ఎంత చెప్పినా నాయకులు వినకపోతే తాను నోటికి పని చెప్పడమే కాకుండా తుపాకి ఎక్కుపెట్టి బస్తీమేసవాల్ అంటూ మీరుండేది ఐదేళ్లే అంటూ వారి మీదకు వెళ్లబోగా పక్కనే ఉన్న సదరు పోలీసులు ఉగ్రరూపం దాల్చిన అతన్ని శాంతింపచేశారు. అయినా టీడీపీ నాయకులు రూల్స్ పాటించకుండా ఇలా ఇష్టమొచ్చినట్లు చేయడం కరెక్ట్ కాదు అని పై అధికారులు అంటున్నారు. ఏది ఏమైనా ఆ పోలీసు కోపానికి టీడీపీ తమ్ముళ్లు వెనక్కి తగ్గారనే చెప్పాలి.