ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన పథకం కింద 2,500 కోట్లు నిధులియ్యాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు కోరారు. మరో 4,500 కోట్లను నాబార్డు నుంచి అప్పు తీసుకోవాల్సి ఉందని ఆయన అన్నారు. కేంద్ర నిధుల కోసం మంత్రి హరీష్ రావు , ఇరిగేషన్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్కె . జోషి తదితరుల బృందం సెప్టెంబర్ రెండవ వారం ఢిల్లీ వెళ్ళాలని నిర్ణయించారు. పిఎంకెఎస్ వై కింద కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వనున్న 11 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అవసరమైన నిధుల కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, నాబార్డు మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరుగుతుందని హరీష్ రావు అన్నారు.
పిఎంకె ఎస్ వై ప్రాజెక్టుల పురోగతిపై గురువారం స్పెషల్ చీఫ్ సెక్రటరీ జోషి ఆధ్వర్యంలో చీఫ్ ఇంజనీర్లతో మరోసారి ఉన్నతస్థాయి సమీక్ష జరగనుంది. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనను, వారంలోపు కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు హుకుం జారీ చేశారు. అసంపూర్తి ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు ఆయా ప్రాజెక్టులకు చెందిన డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, ఫీల్డ్ ఛానల్స్ తదీతర సాగునీటి సరఫరా వ్యవస్థల కోసం కూడా కేంద్రం నిధులివ్వాలని మంత్రి హరీష్ రావు కోరారు. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద దేశవ్యాప్తంగా అసంపూర్తిగా వున్న 99 ప్రాజెక్టులలో తెలంగాణలోని 11 ప్రాజెక్టులు వున్నాయి. పిఎంకె ఎస్ వైలో చోటు దక్కిన 11 ప్రాజెక్టులలో 7 మధ్యతరహా ప్రాజెక్టులు, 4 మేజర్ ప్రాజెక్టులున్నాయి.