ఓటుకి నోటు కేసులో నిందితులుగా ఉన్న రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహ, సెబాస్టియన్ లకి ఈరోజు ఏసిబి కోర్టు సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 29న జరిగే విచారణకి ముగ్గురూ హాజరు కావాలని ఆదేశించింది. ఈరోజు ఏసిబి అధికారులు కోర్టులో ఓటుకి నోటు కేసుపై తాజాగా ఒక మెమో దాఖలు చేసి, గతంలో దాఖలు చేసిన చార్జ్ షీట్ ఆధారంగానే ఈ కేసుని పునర్విచారణ జరుపుతామని చెప్పడంతో కోర్టు అందుకు అంగీకరించింది. ఆ ఛార్జ్ షీట్ కి 15/16 నెంబరు కేటాయించింది. కోర్టుకి హాజరయిన ఏసిబి అధికారుల తరపు న్యాయవాది ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్ర గురించి ఆ ఛార్జ్ షీట్ ఆధారంగానే విచారణ జరిపి సెప్టెంబర్ 29లోగా ఆ వివరాలని కోర్టుకి అందజేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కేసులో చంద్రబాబు నాయుడు పాత్రపై కూడా విచారణ చేస్తామని ఏసిబి అధికారులు కోర్టుకి చెప్పడం, రేవంత్ రెడ్డి తదితరులకి కోర్టు సమన్లు జారీ చేయడంతో తెదేపాలో మళ్ళీ అలజడి మొదలైంది. ఇది వరకు ఫోన్ ట్యాపింగ్ కేసుని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు బయటపడగలిగారు. కనుక ఈసారి కూడా మళ్ళీ దానితోనే బయటపడతారా? లేదా అనేది త్వరలోనే తెలుస్తుంది.
చంద్రబాబు నాయుడుకి చాలా సన్నిహితుడుగా పేరున్న కేంద్రమంత్రి సుజనా చౌదరి ఢిల్లీ లో హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీలతో సమావేశం అయిన తరువాత, హైదరాబాద్ చేరుకొని నేరుగా గవర్నర్ నరసింహాన్ని కలవడంతో ఈ కేసుని నీరుగార్చేందుకే ఆయన గవర్నర్ ని కలిసి ఉంటారని వైకాపా నేత బొత్స సత్యనారాయణ అనుమానాలు వ్యక్తం చేసారు. మరొక నాలుగైదు రోజులలోనే ఈ కేసులో నిందితులందరికీ ఏసిబి నుంచి నోటీసులు అందవచ్చు. ఈసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కూడా ఏసిబి నోటీసులు ఇస్తుందా లేదా అనే సంగతి త్వరలోనే తెలుస్తుంది. అదే జరిగితే ఆయన రాజీనామా చేయవలసి వచ్చినా ఆశ్చర్యం లేదు.