హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలలో బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దానితో నగరంలో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. మరో మూడు రోజుల పాటు ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రేపటి నుంచి పడబోయే వర్షం గత 15 ఏళ్ళలో ఎన్నడూ చూడనంత స్థాయిలో ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
ఈ రోజు ఉదయం నుంచి కురుస్తున్న వానలతో దిల్ సుఖ్ నగర్, రామంత పూర్, అబిడ్స్, కోటి, బషీర్ బాగ్, నాంపల్లి, లక్డీకా పూల్, చిక్కడపల్లి, కుశాయి గూడా, మల్కాజ్ గిరి, పంజా గుట్ట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ తదితర ప్రాంతాలు జలమయం అయ్యాయి. మియాపూర్ నుంచి దిల్ సుఖ్ నగర్ చేరుకోవడానికి 4.30 గంటలు పట్టింది. అంతగా రోడ్లు జలమయం అయ్యాయి. కుండపోతగా కురుస్తున్న వానలతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోంది. జలమయం అయిన రోడ్లపై ద్విచక్ర వాహనదారులు, ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బందిపడుతున్నారు. అనేక చోట్ల మహిళలు తమ వాహనాల పై నుండి వాన నీటిలో పడిపోతున్నారు. సాయంత్రం ఆఫీసులు వదిలే సమయానికి ట్రాఫిక్ ఇంకా పెరుగుతుంది కనుక జంట నగరాలలో ఎక్కడికక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలున్నాయని ట్రాఫిక్ పోలీస్ అధికారులు చాలా ఖంగారు పడుతున్నారు.
తప్పనిసరి అయితే తప్ప ఇళ్ళలో నుంచి ఎవరూ బయటకి రావద్దని జీ.హెచ్.ఎం.సీ. కమిషనర్ జనార్ధన్ రెడ్,డి ప్రజలకి విజ్ఞప్తి చేయడం గమనిస్తే పరిస్థితి తీవ్రత అర్ధం అవుతుంది. ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ టికెట్స్ బుకింగ్ కేంద్రంలోకి నీళ్ళు చేరాయి. ఆ నీళ్ళలోనే నిలబడి ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. రిజర్వేషన్ కౌంటర్ పరిసర ప్రాంతాలలో మోకాలి లోతు నీళ్ళు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలలో ప్రజలని అధికారులు సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు. రామంతాపూర్ లోని ప్రగతి నగర్ లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఇల్లు కూలి నలుగురు మరణించారు. ముషీరాబాద్ లోని బోలక్ పూర్ లో కూడా ఇల్లు కూలి ఇద్దరు పసి పిల్లలతో సహా ముగ్గురు మరణించారు. భారీ వర్షాల కారణంగా హుస్సేన్ సాగర్ కూడా శరవేగంగా నిండిపోతోంది. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులు గమనిస్తూ నీటిని బయటకి విడుదల చేస్తున్నారు.
హైదరాబాద్ జంట నగరాలలోనే కాకుండా ఖమ్మం, నల్గొండ జిల్లాలో కూడా చాలా భారీ వర్షాలు కురిసాయి. పెద్దేముల్- 22, పరిగి-21, గండేడు-13, పర్వత గిరి-13, మిర్యాలగూడ-11, తిమ్మాపూర్ లో 12, కొత్తగూడెంలో 10, తాండూరు-8.3 సెంటి మీటర్లు వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరో మూడురోజుల పాటు ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలలో చాలా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. లోతట్టు ప్రాంతాలలో ప్రజలని సురక్షిత ప్రాంతాలకి తరలించే ఏర్పాట్లు చేయిస్తున్నారు. రాగల 24గంటలు అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్, చీఫ్ సెక్రెటరీ రాజీవ్ శర్మ, మంత్రి కెటిఆర్ ముగ్గురూ కూడా నిరంతరం అధికారులతో మాట్లాడుతూ పరిస్థితులని సమీక్షిస్తూ తగిన సూచనలు సలహాలు ఇస్తున్నారు.