వరంగల్ జిల్లా విభజనపై ప్రతిపక్షాల సలహా పాటిస్తే మంచిదేమో

తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకి ఒక పక్క జోరుగా సన్నాహాలు జరుగుతుంటే, మరో పక్క ప్రతిపక్షాలు వరంగల్ ని రెండుగా విభజించవద్దని, జనగామని జిల్లాగా ప్రకటించాలని కోరుతూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇంకా మరికొన్ని మండలాలు, రెవెన్యూ డివిజన్ల కూర్పు పట్ల కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పై వచ్చిన అభ్యంతరాలు, సలాహాలు, సూచనలపై చర్చించేందుకు ప్రభుత్వం మళ్ళీ అఖిలపక్ష సమావేశం నిర్వహించినట్లయితే ఆ విషయాలన్నీ ఎలాగూ చర్చకి వస్తాయి. కానీ ఈ లోగా ప్రతిపక్షాలు తమ ఆందోళనలని నానాటికీ ఉదృతం చేస్తున్నాయి. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.

నిన్న హన్మకొండలో ప్రతిపక్షాలు కలిసి చేసిన ధర్నాలో మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ ఎంపి సర్వే సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కొత్త జిల్లాల ఏర్పాటు పరిపాలనా సౌలభ్యం కోసమో, ప్రజలకి సౌకర్యం కల్పించేందుకో కాకుండా తెరాసని బలోపేతం చేసుకొనేందుకు, పార్టీ నేతలు ఈటెల రాజేందర్, కెప్టెన్ లక్ష్మీ కాంతారావు, కెసిఆర్ కుటుంబ సభ్యుల కోసమే ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. కెసిఆర్ కుటుంబానికి భువనగిరిలో భూములు ఉన్నందునే యాదాద్రి జిల్లాని, ఈటెల, లక్ష్మీ కాంతారావు, మై హోమ్స్ అధినేత రామేశ్వర రావు కోసం ఒక్కో జిల్లాని ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. జిల్లాల పునర్విభజనతో తెరాస బలోపేతం చేసుకోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్ కలలుగంటున్నప్పటికీ, అదే తెరాస పతనానికి కారణం అవుతుందని సర్వే సత్యనారాయణ హెచ్చరించారు.

రాష్ట్ర విభజన ఎంత సంక్లిష్టమైనదో, జిల్లాల పునర్విభజన కూడా అంతే సంక్లిష్టమైనది. కనుక ఎంత నిజాయితీగా ఆ పని చేసినా ఎవరో ఒకరికి అసంతృప్తి కలుగకమానదు. ఇటువంటి ఆరోపణలు చేయకమానరు. కానీ ఒక్క వరంగల్ విషయంలోనే ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వ నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. కనుక ప్రభుత్వం దానిపై తన నిర్ణయాన్ని పునః సమీక్షించుకొని ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకొంటే దాని గౌరవం ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గదు. అదే విధంగా వాటిని మంచి చేసుకోవడానికి ఇంకా కొత్త జిల్లాలని సృష్టించనవసరం లేదు. అది కూడా రాష్ట్రానికి చాలా నష్టం కలిగించవచ్చు. కొత్త జిల్లాల ఏర్పాటు గురించి ప్రభుత్వం ప్రతిపక్షాలతో చర్చించి, సమిష్టి నిర్ణయం తీసుకోగలిగితే దాని వలన ఇటువంటి విమర్శలు తప్పుతాయి. అందరికీ ఆమోదయోగ్యంగా చక్కగా జిల్లాలని ఏర్పాటు చేసుకోవచ్చు.