తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి రెండున్నరేళ్ళు పూర్తవుతుంటే ఇప్పుడు అది ఎవరి వలన ఏర్పడింది అనే చర్చ అసంబద్దంగానే ఉంటుంది. నిజానికి దానిపై కూడా చాలా లోతుగా చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ నేతలు సోనియా గాంధీ వల్లనే తెలంగాణ ఏర్పడిందని వాదిస్తారు. టిఆర్ఎస్ నేతలు కెసిఆర్ చేసిన ఉద్యమాల వలనే ప్రత్యేక రాష్ట్రం కల సాకారం అయ్యిందని వాదిస్తే, భాజపా సహకరించబట్టే అది జరిగిందని ఆ పార్టీ నేతలు వాదిస్తుంటారు. కానీ టిడిపి రాజ్యసభ సభ్యుడు టి.జి.వెంకటేష్ ‘తెలంగాణ ఏర్పడటానికి రెడ్డే కారణం’ అని వాదిస్తున్నారు. అందుకు ఆయన కనిపెట్టిన సిద్ధాంతం ఇంకా హాస్యాస్పదంగా ఉంది.
వై యస్ రాజశేఖర్ రెడ్డి ఆకస్మికంగా మరణించిన తరువాత ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబట్టిన జగన్మోహన్ రెడ్డి అది దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి వేరు కుంపటి పెట్టుకొన్నారని, ఒకవేళ ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఉంటే సోనియా గాంధీ రాష్ట్ర విభజన చేసేవారే కాదని టి.జి.వెంకటేష్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ బయటకి వెళ్ళిపోవడంతో పార్టీలో అంత బలమైన నేత లేకపోవడం చేతనే సోనియా గాంధీ రాష్ట్ర విభజన చేశారని ఆయన అన్నారు. అంటే తెలంగాణ ఏర్పాటు కోసం 60ఏళ్లుగా సాగిన ఉద్యమాలు కారణం కాదు..రాష్ట్రంలో ప్రతిపక్షాలు, కెసిఆర్ చేసిన ఉద్యమాలు కారణం కాదు. రాష్ట్రంతో సంబంధం లేని జగన్మోహన్ రెడ్డే అసలు కారణమా! ఆయన కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టేయడం వల్లనే సోనియా గాంధీ రాష్ట్ర విభజన చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినట్లు టి.జి.వెంకటేష్ కనిపెట్టారన్న మాట! శబాష్..
అధికార దాహంతో పరితపించిపోతున్న జగన్మోహన్ రెడ్డి ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగినా, తెలంగాణ ఏర్పాటుని మరి కొంచెం కాలం వాయిదా పడేదేమో కానీ దానిని అడ్డుకోవడం ఎవరితరం కాదని అందరికీ తెలుసు. ఆ సంగతి జగన్మోహన్ రెడ్డి కూడా బాగానే పసిగట్టాడు. అందుకే రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలవగానే తెలంగాణలో తన పార్టీని, నేతలని రోడ్డున పడేసి ఆంధ్రా వెళ్ళిపోయి రాష్ట్ర విభజనని వ్యతిరేకిస్తూ భూటకపు ఉద్యమాలు చేశారు. ఆ ఉద్యమాలు తెలంగాణ ఏర్పాటుని వ్యతిరేకిస్తున్నాయనుకోలేము. అవి ఏపి ప్రజలని ఆకట్టుకొని 2014 ఎన్నికలలో గెలవాలనే ఆలోచనతో చేసిన భూటకపు ఉద్యమాలే. కానీ జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా రాష్ట్ర విభజన ఆగలేదు... ముఖ్యమంత్రి కాలేకపోయాడు.