జి.ఎస్.టి.బిల్లు కోసం ఒక్కరోజు శాసనసభ సమావేశాలు

పార్లమెంటు ఆమోదించిన జి.ఎస్.టి.బిల్లుపై చర్చించి, దానికి మద్దతు తెలుపుతూ తీర్మానం ఆమోదించేందుకే ఈరోజు ఒక్కరోజు మాత్రమే ప్రత్యేకంగా తెలంగాణ  శాసనసభ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉదయం 11గంటలకి సమావేశాలు మొదలవగానే ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి జి.ఎస్.టి.బిల్లుని సభలో చర్చకి ప్రవేశపెట్టారు. దానిపై జరుగుతున్న చర్చలో ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ, జి.ఎస్.టి.బిల్లు వల్ల సామాన్య ప్రజలకి చాలా మేలు జరుగుతుందనే ఉద్దేశ్యంతోనే కేంద్ర ప్రభుత్వం దానిని ప్రవేశ పెట్టిందని, దాని వలన రాష్ట్రాలు కోల్పోయే ఆదాయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వమే భర్తీ చేస్తుందని బిల్లులోనే నిర్ధిష్టంగా హామీ ఇచ్చిందని కనుక సభ్యులు అందరూ ఆ బిల్లుకి ఏకగ్రీవంగా మద్దతు తెలపాలని కోరారు. ప్రస్తుతం దానిపై సభలో చర్చ జరుగుతోంది.

ఈ బిల్లుకి పార్లమెంటులో అన్ని పార్టీలు మద్దతు తెలిపి ఆమోదించాయి కనుక తెలంగాణ శాసనసభలో కూడా డానికి అనుకూలంగా తీర్మానం చేయడం కేవలం లాంఛనప్రాయమేనని చెప్పవచ్చు. ఇప్పటికే దేశంలో 9 రాష్ట్రాలు ఈ బిల్లుకి మద్దతుగా శాసనసభలలో తీర్మానాలు చేసి పంపాయి. త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా దానికి మద్దతుగా తీర్మానం చేసి పంపబోతోంది. కనుక దానికి రాష్ట్రపతి ఆమోదముద్ర పడటం కూడా లాంఛనప్రాయమేనని చెప్పవచ్చు. కనుక వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి అంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ నూతన ఏకీకృత పన్ను విధానం దేశంలో అమలులోకి రావడం కూడా ఖాయమే. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దాని కోసం శరవేగంగా చాలా ఏర్పాట్లు కూడా చేస్తోంది.

Update: 

కొద్ది సేపటి క్రితం శాసనసభ జి.ఎస్.టి.బిల్లుని ఏకగ్రీవంగా ఆమోదించింది. దీనితో దేశంలో ఈ బిల్లుకి అనుకూలంగా తీర్మానం చేసిన 10వ రాష్ట్రంగా తెలంగాణా నిలిచింది. సమావేశాల అనంతరం, బిజినెస్ ఎడ్వైజరీ కమిటీ సమావేశం అయ్యింది. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి 10 రోజులు (పనిదినాలు) శాసనసభ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం జరిగింది.