ఏపి వైసిపి ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి ఓటుకి నోటు కేసుని పునర్విచారణ చేయాలంటూ వేసిన పిటిషన్ పై ఏసిబి కోర్టు సానుకూలంగా స్పందించడంతో మళ్ళీ రెండు తెలుగు రాష్ట్రాలలో దాని గురించి, చంద్రబాబు నాయుడు భవిష్యత్ గురించి చాలా జోరుగా చర్చలు మొదలయ్యాయి.
ఈ కేసుని తెదేపా, దాని అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై కెసిఆర్ బ్రహ్మాస్త్రం లాగా ప్రయోగించారు కానీ ఒక కేంద్రమంత్రి జోక్యంతో వెనక్కి తగ్గినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఏపి వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డి ఇరువురు ముఖ్యమంత్రులపై తీవ్ర ఆరోపణలు చేశారు.
చంద్రబాబు నాయుడు ఈ కేసు నుంచి బయట పడేందుకు కెసిఆర్ కి రూ.500 కోట్లు చెల్లించారని ఆరోపించారు. అందుకే కెసిఆర్ ఈ కేసుని నీరుగార్చారని భూమన ఆరోపించారు. ఈ కేసు విషయంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా అనుమానాస్పదంగా ఉందని అన్నారు. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి ఉంటే, ఈ కేసులో దోషులకి ఎప్పుడో శిక్షలు పడి ఉండేవని కానీ ఇద్దరు ముఖ్యమంత్రులు లాలూచీ పడటంతో కేసుని నీరుగార్చారని భూమన ఆరోపించారు. అయితే ఆయన తన ఆరోపణలకి బలమైన ఆధారాలు ఏవీ చూపించలేదు.
ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులపై ఇటువంటి తీవ్రమైన ఆరోపణలు చేస్తే వాటిని నిరూపించే బలమైన ఆధారాలు కూడా చూపించవలసిన బాధ్యత ఆరోపణలు చేసిన వారిపైనే ఉంటుంది. లేకుంటే ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ముఖ్యమంత్రులు తమ నిజాయితీని నిరూపించుకోవడానికి తప్పనిసరిగా భూమన కరుణాకర్ రెడ్డిపై పరువు నష్టం దావానో మరొకటో వేయవలసి ఉంటుంది.
అయితే, ఈ కేసు నీరుగార్చడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు కూడా టెలిఫోన్ ట్యాపింగ్ కేసుని బయటపెట్టడమేనని చెప్పవచ్చు. రెండు కేసులు చాలా తీవ్రమైనవే కావడంతో ఇద్దరు ముఖ్యమంత్రులు వాటిలో చిక్కుకుపోయి బయటపడలేక ఇబ్బందులు పడుతున్నప్పుడు ఒక కేంద్రమంత్రి చొరవ తీసుకొని వారి మధ్య రాజీ కుదిర్చినట్లు వార్తలు వచ్చాయి. ఆ తరువాతే రెండు ప్రభుత్వాలు ఆ రెండు కేసులని అటకెక్కించేశాయి. ఆ తరువాతే, పదేళ్ళ పాటు హైదరాబాద్ లోనే ఉంటానని చెప్పిన చంద్రబాబు నాయుడు రాత్రికి రాత్రే మూట ముల్లె సర్దుకొని విజయవాడ తరలి వెళ్లిపోయారు. తన ఉద్యోగులని కూడా తరలించుకొని వెళ్ళిపోతున్నారు. కనుక భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలని నమ్మలేము. కానీ వాటిని ఆయన నిరూపించవలసి ఉంది. లేకుంటే ఇద్దరు ముఖ్యమంత్రులు ఆయనని కోర్టుకీడ్చవలసి ఉంటుంది.