ఆ తీర్పు వైసిపికే సిగ్గుచేటు కాదా?

తెలంగాణ లో కొత్త జిల్లాల ఏర్పాటు గురించి ప్రతిపక్షాల అభిప్రాయాలు తెలుసుకొనేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ కొన్ని రోజుల క్రితం అఖిలపక్ష సమావేశం నిర్వహించి దానికి అన్ని పార్టీలని ఆహ్వానించి వైకాపాని మాత్రం పిలవకపోవడంతో ఆ పార్టీ చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శివకుమార్ దానికోసం హైకోర్టులో ఒక పిటిషన్ కూడా వేశారు. ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న తమ పార్టీని అఖిలపక్ష సమావేశానికి పిలవకపోవడం తప్పని, కనుక ఇకపై జరిగే సమావేశానికి తమని ఆహ్వానించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్ లో కోరారు. హైకోర్టు కూడా వైసిపి వాదనతో ఏకీభవిస్తూ ఇక ముందు జరిగే అఖిలపక్ష సమావేశాలకి వైసిపిని కూడా ఆహ్వానించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అయితే హైకోర్టుకి వెళ్లి ఈ విధంగా ఆహ్వానం తెప్పించుకోవడం ఆ పార్టీకి చాలా గొప్పగా అనిపించవచ్చేమో కానీ నిజానికి అది వారికే సిగ్గుచేటని చెప్పక తప్పదు. లోటస్ పాండ్ లో తప్ప బయట ఎక్కడా ఎప్పుడూ కనబడని ఆ పార్టీ తెలంగాణలో ఏం చేస్తోందో...ఏం చేయాలనుకొంటోందో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. ఏనాడూ ప్రజా సమస్యల గురించి మాట్లాడని వైసిపి, జిల్లాల ఏర్పాటు గురించి మాత్రం ఎందుకు మాట్లాడాలనుకొంటోంది? ఏమి మాట్లాడాలనుకొంటోంది? అనే సంగతి దానికే తెలియాలి. అది చెపుతున్న ముగ్గురు ఎమ్మెల్యేలు ఎప్పుడో టిఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. కనుక వారి గురించి చెప్పుకొని ఆహ్వానం కోరుకోవడం ఇంకా సిగ్గుచేటు.

డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పై వచ్చిన సలహాలు, సూచనలపై చర్చించేందుకు అవసరమైతే మరొకటి రెండుసార్లు అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. నిర్వహిస్తే మంచిదే కానీ నిర్వహించకపోతే వైసిపిని పిలవవలసిన అవసరమే ఉండదు. హైకోర్టుకి వెళ్లి వైసిపి ఏమి సాధించింది అంటే అఖిలపక్షానికి తనకి ఆహ్వానం అందలేదనే సంగతిని స్వయంగా లోకానికి చాటింపు వేసుకొన్నట్లయింది తప్ప మరేమి ఉండదు.