చంద్రబాబుని భూతంలా వెంటాడుతున్న ఓటుకి నోటు కేసు

ఓటుకి నోటు కేసు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని, తెదేపాని ఇంకా భూతంలా వెంటాడుతూనే ఉంది. ఆ కేసు కారణంగానే తెలంగాణ లో తెదేపా పరువు పోగొట్టుకొంది. చంద్రబాబు నాయుడు విజయవాడ తరలి వెళ్లి పోయారు. తెలంగాణలో తెదేపా తుడిచిపెట్టుకుపోతున్నా దానిని కాపాడుకోలేక దూరంగానే ఉండిపోవలసి వస్తోంది. తెలంగాణలో పార్టీని పణంగా పెట్టి ఇన్ని త్యాగాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. మళ్ళీ ఆ కేసుని పునర్విచారించాలని కోరుతూ మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే అల్లా రామకృష్ణా రెడ్డి ఏసిబి కోర్టులో ఒక పిటిషన్ వేశారు. దానిపై న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది.

తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో ఫోన్ లో మాట్లాడిన వ్యక్తి చంద్రబాబేనని ఫోరెన్సిక్ నివేదికలో నిర్ధారణ చేసిన తరువాత కూడా ఆయనని ఈ కేసు నుంచి తప్పించే ప్రయత్నాలు జరిగాయని, కనుక ఈ కేసులో చంద్రబాబు పేరును కూడా చేర్చి పునర్విచారణకి ఆదేశించాలని వైకాపా ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి తన పిటిషన్ ద్వారా న్యాయస్థానాన్ని కోరారు. అయితే చంద్రబాబు పేరుని చేర్చాలని ఆదేశించలేదు కానీ సెప్టెంబర్ 29 లోగా ఈ కేసు పునర్విచారణ పూర్తి చేయాలని ఏసిబిని ఆదేశించింది. కనుక తెదేపాకి, చంద్రబాబు నాయుడుకి మళ్ళీ సమస్యలు మొదలైనట్లే భావించవచ్చు.

క్రిందటిసారి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకొన్నందునే ఈ కేసు చాలా దూరం వెళ్ళింది. ఇప్పుడు తెలంగాణాలో తెదేపా నుంచి, చంద్రబాబు నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఎటువంటి సవాలు విసరడం లేదు కనుక మళ్ళీ ఈ కేసుని ఏదో ఒక దశలో తొక్కిపట్టినా ఆశ్చర్యం లేదు. కానీ ఈసారి తెదేపాకి బద్దశత్రువైన వైకాపా ఈ పిటిషన్ వేసింది కనుక, ఈ కేసు ఎంత దూరం వరకు వెళుతుందో ఇప్పుడే చెప్పడం కష్టమే. ఈ కేసు ఇంకా సజీవంగానే ఉందనే సంగతిని చంద్రబాబు నాయుడుకి మరొక్కమారు గుర్తు చేసినట్లుగా భావించవచ్చు. దీనిపై టిడిపి నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.