మహా ఒప్పందంపై కాంగ్రెస్ లో మహా అంతర్యుద్ధం

ఇటీవల తెలంగాణ-మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య మహా ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. దానితో రాష్ట్ర ప్రయోజనాలని మహారాష్ట్ర వద్ద తాకట్టు పెట్టారంటూ రాష్ట్ర కాంగ్రెస్ నేతలందరూ కలిసికట్టుగా ముఖ్యమంత్రి కెసిఆర్ పై విమర్శలు గుప్పిస్తుంటే, ఆయన కూడా వారికి ప్రతి సవాలు విసిరారు. వారు తన తప్పుని నిరూపిస్తే ముఖ్యమంత్రి పదవిలో నుంచి దిగిపోతానని సవాలు విసిరారు.

ఈ మహా ఒప్పందంపై కాంగ్రెస్, తెరాస నేతల మధ్య తీవ్ర విమర్శలు, ప్రతివిమర్శలు సాగుతుంటే సీనియర్ కాంగ్రెస్ నేత కె.జానారెడ్డి తమ పార్టీ నేతలతో కలిసి తెరాసని ఎదుర్కోవలసి ఉండగా, ‘పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెపుతున్నట్లుగా తుమ్మడిహట్టి ప్రాజెక్టుని 152 మీటర్ల ఎత్తుతో నిర్మించుకోవడానికి తమ కాంగ్రెస్ ప్రభుత్వం మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోలేదని ప్రకటించారు. దానితో ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా కాంగ్రెస్ నేతలు అందరూ ప్రజలని తప్పు ద్రోవ పట్టిస్తున్నట్లుగా జానారెడ్డి స్వయంగా చాటి చెప్పినట్లయింది. ఆయన ప్రకటనతో కాంగ్రెస్ నేతలు అందరూ ప్రజల ముందు తలవంచుకోవలసి వచ్చింది. ఇంతవరకు టిఆర్ఎస్ పార్టీపై, ముఖ్యమంత్రి కెసిఆర్ పై వారు దాడి చేసేవారు. కానీ ఇప్పుడు జానారెడ్డి కారణంగా టిఆర్ఎస్ నేతలు ఎదురుదాడి చేస్తుంటే కాంగ్రెస్ నేతలు మౌనం వహించాల్సి వస్తోంది.

నయీం ఎన్ కౌంటర్ విచారణపై కాంగ్రెస్ పార్టీ సిబిఐ విచారణకి డిమాండ్ చేస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం సిఐడి విచారణ చేయిస్తోంది. అందుకు కాంగ్రెస్ నేతలు టిఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. కానీ జానారెడ్డి టిఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలబడుతూ నయీం కేసులో సిఐడి పోలీసులు చక్కగా దర్యాప్తు చేస్తున్నారని, కనుక సిఐడి విచారణ సరిపోతుందని, సిబిఐ విచారణ అవసరం లేదని ప్రకటించి కాంగ్రెస్ నేతలకి మరో షాక్ ఇచ్చారు.

జానారెడ్డి తీరుపై కాంగ్రెస్ నేతలు అందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనని మందలించడానికే ఈరోజు గాంధీ భవన్ లో శాసనసభ్యుల సమావేశం నిర్వహించబోతున్నారు. ఆయన తీరు వలన పార్టీకి చాలా నష్టం జరుగుతోంది కనుక ఆయన ఇదే విధంగా టిఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించదలిస్తే తన పదవిలో నుంచి దిగిపోవాలని కోరబోతున్నారు. జానారెడ్డి గతంలోనే అందుకు సిద్ధ పడ్డారు కానీ పార్టీలో సీనియర్ నేతలు వారించడంతో వెనక్కి తగ్గారు. కనుక ఇవ్వాళ పార్టీ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు ఆయనని మందలిస్తే ఆయన పదవిలో నుంచే కాదు పార్టీకే రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరిపోతారేమో?