పోలీసులు, గత ప్రభుత్వాల అండదండలతో అరాచకమే తన వృత్తిగా, ధనార్జనే ప్రవృత్తిగా పెట్టుకుని నేర సామ్రాజ్యానికి చక్రవర్తిలా వ్యవహరించిన మాజీ మావోయిస్టు, గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరుల అరెస్టుల పర్వం కొనసాగుతుంది. తాను పోలీసులకు పట్టుబడితే తనతో పాటు తన సామ్రాజ్యంలోని ప్రతీ ఒక్కరు, తన నుంచి లాభం పొందిన వారందరూ పట్టుబడాలని నయీమ్ రాసుకున్న డైరీ ఆధారంగా అనేక మంది పాపాలు పండుతున్నాయి. నేరాలు, ఘోరాలకు పాల్పడి రాత్రికి రాత్రే కుబేరులు కావాలని యోచించిన వారందరికీ నయీమ్ కథ ఒక గుణపాఠం.
నయీమ్ తో పాటుగా నేరాలకు పాల్పడటం, అతనికి సహకరించడం, అతని టార్గెట్లను భయాందోళనకు గురిచేసి అక్రమాస్తులను కూడగట్టుకున్న అనుచరులకు మాత్రం భవిష్యత్ అంతా కాళరాత్రులను మిగల్చనుంది. అక్రమంగా సంపాదించిన అస్తులు పోవడంతో పాటు వారు కూడా జైళ్లకు వెళ్లాల్సిరావడం ఇక్కడ మరో పరిణామం. ఇన్నాళ్లు అక్రమంగా సంపాదించిన డబ్బుతో కుటుంబాలతో హాయిగా జల్సా చేసిన నయీం అనుచరులు.. తాము వేధింపులకు గురిచేసిన వారి శాపం తగిలి ఏకంగా కటకటాలను లెక్కబెడుతున్నారు. తాజాగా సిట్ పోలీసులు మరో నయీం అనుచరుడు నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నయీం బినామీ సంజీవరెడ్డికి అనుచరుడిగా నరేందర్ రెడ్డి ఉన్నట్లు గుర్తించారు. నయీం భార్య పోలీసుల విచారణలో పలు కీలక అంశాలను బయటపెట్టిన నేపథ్యంలో అ దిశగా కూడా పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.