ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినప్పుడే నిజమైన అభివృద్ధి జరిగిందని భావించాలని.. అప్పుడే ప్రభుత్వం ఆలోచించే బంగారు తెలంగాణ సాకారమవుతుందని టీజేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన నూతన రాష్ట్రంలో మార్పులు అవసరమని.. అయితే అవి ప్రజాభిప్రామం, ప్రజామోదం మేరకే వుండాలి తప్ప.. ఇష్టానుసారంగా, ఏకపక్ష ధోరణితో, స్వార్థ ప్రయోజనాలతో ముడిపడి వుండరాదని అయన హితవు పలికారు.
నాచారంలో ‘తెలంగాణ - అభివృద్ధి నమూనా - టీజేఏసీ ఆలోచన’ అనే అంశంపై జరిగిన సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించిన కోదండరాం.. రాష్ట్రంలో చేపడుతున్న మార్పులపై.. అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. ప్రభుత్వం అభివృద్ధి పేరుతో నిధులను ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తోందని, అయితే ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం తగ్గించి, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉపయోగం కలిగేలా ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. గత ఏడాది పంటలు ఎండిపోయి నష్ట పోయిన రైతులకు ఇప్పటి వరకు నష్టపరిహారం అందలేదని అవేదన వ్యక్తం చేశారు.
ఈ ఏడాది సరైన వర్షాలు లేకపోవడంతో రైతులు నష్టపోయారని, వారిని ఆదుకోవడానికి, కరువు పరిస్థితులను అంచనా వేయడానికి ప్రభుత్వం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సబబు కాదన్న కోదండరామ్, అన్ని పార్టీలతో కలసి.. ప్రజామోదం మేరకే నిర్ణయాలు తీసుకోవాలని ఆయన సూచించారు. జోనల్ వ్యవస్థ రద్దు అనే అంశంపై విస్తృత చర్చ జరగాలని అన్నారు. కృష్ణా, గోదావరి జలాల వినియోగం, జిల్లాల పునర్విభజన, ఉద్యోగ అవకాశాలపై విస్తృత చర్చ జరిపామని కోదండరామ్ తెలిపారు.