పోలీసులు చట్టం నుంచి మినహాయింపుదార్లా..?

చట్టం ముందు అందరూ సమానమేనని ఎవరికీ ఎలాంటి మినహాయింపులు వుండరాదని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఒక వ్యక్తి ఆత్మహత్యకు కారణమైన వారిపై ఎలాంటి కేసులు నమోదు చేస్తారో.. పోలీస్ ఉన్నతాధికారులపై కూడా అదే కేసులు నమోదు చేయాలని అయన అన్నారు. మెదక్‌ జిల్లా కుక్కునూరుపల్లి ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి ఆత్మహత్య విషయంలో గజ్వేల్‌ డీఎస్పీ, సీఐలపై 306 కేసు నమోదు చేయాలని అయన డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా మఠంపల్లి మండలం బక్కమంతులగూడెంలో నిర్వహించిన ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి సంతాప సభలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రానికి దిశానిర్ధేశం చేసే ముఖ్యమంత్రి ఇలాఖాలోనే పోలీసు అధికారుల ఒత్తిళ్లకు ఓ పోలీస్‌ ఆత్మహత్యకు పాల్పడితే పట్టించుకోకపోవడం అత్యంత దారుణమన్నారు. సిఐ, డీఎస్సీలకు కేసీఆర్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన మండిపడ్డారు. క్రమశిక్షణా చర్యల కింద వారిపై బదిలీ వేటు వేస్తే సరిపోదని, వారిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలన్నారు. రామకృష్ణారెడ్డి మృతిపై వెంటనే ఆత్మహత్యకు గల కారణాలను పరిశోధించి నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. మృతుని కుటుంబానికి నష్టపరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగమిచ్చి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.