కొత్త జిల్లాల ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పై ప్రజలు, ప్రతిపక్షాలు, స్వచ్చంద సంస్థల నుంచి ఇంత వరకు 7889 ఫిర్యాదులు, సూచనలు, సలహాలు అందాయి. గజ్వేల్, జనగావ్, సిరిసిల్లాలని జిల్లాలుగా ప్రకటించకపోవడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయినట్లు తెలుస్తోంది. మిగిలిన వాటిలో అత్యధికం ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న కొత్త జిల్లాల ఏర్పాటుని వ్యతిరేకించకపోవడం హర్షణీయం. వాటిలో 800 సూచనలు లేదా సలహాలు మండలాలు, రెవెన్యూ డివిజన్స్ ఏర్పాటు గురించి ఉన్నట్లు అధికారులు తెలిపారు.
కొత్తగా ఏర్పాటు చేయబోయే వనపర్తి, పెద్దపల్లి, నిర్మల్, యాదాద్రి జిల్లాలలో ఇరుగుపొరుగు గ్రామాలు లేదా మండలాలని కలపడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదులు అందాయి. ఇంతవరకు కరీంనగర్ జిల్లా కేంద్రంగా ఉన్న జగిత్యాల ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయడంతో, కరీంనగర్ లో రెవెన్యూ డివిజన్లు కొన్ని జగిత్యాల లోకి వెళ్ళిపోతున్నాయి. కేవలం వాటికి సంబంధించి 205 ఫిర్యాదులు అందాయి. నిర్ణీత గడువు (సెప్టెంబర్ 20వ తేదీ) తరువాత వాటిని క్యాబినెట్ సబ్ కమిటీ పరిశీలించి అవసరమైన మార్పులు చేర్పులు చేసిన తరువాత తుది నోటిఫికేషన్ వెలువరిస్తుంది.
ఏది ఏమైనప్పటికీ దసరా నుంచి కొత్త జిల్లాలు ఏర్పడటం తద్యం. అయితే మొదటి రోజున జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు మాత్రమే బాధ్యతలు నిర్వర్తిస్తారు. మరుసటి రోజు నుంచి ఉన్నతాధికారులు, ఉద్యోగులు అందరూ విధులలో చేరుతారు. జిల్లాల వారిగా ఉద్యోగుల కేటాయింపు, కార్యాలయాల ఏర్పాటు ప్రక్రియ చాలా జోరుగా సాగుతోంది. దసరా (అక్టోబర్ 11) నాటికి అది కూడా పూర్తవుతుంది. కనుక దసరా నుంచి 27జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పడటం ఖాయమే.