ఖరారు: పవన్ బహిరంగ సభ రేపే

సినిమాలతో బిజీగా ఉండి, చాలా కాలం నుండి రాజకీయాలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్, ఎట్టకేలకు ఇప్పుడు రాజకీయాల వైపు అడుగులేస్తున్నారు. రేపు తిరుపతిలో భారీ బహిరంగ సభకు పవన్ పిలుపునిచ్చారు. నిన్న జూనియర్ ఎన్టీఆర్ అభిమాని చేతిలో హత్య చేయబడ్డ తన అభిమాని వినోద్ ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించిన పవన్, రోదిస్తున్న అభిమాని తల్లిని చూసి ఉద్వేగానికి లోనైన విషయం తెలిసిందే. ఆ వెనువెంటనే తిరుపతి దర్శనం చేసుకున్న పవన్, ఇప్పుడు మళ్ళీ తిరుపతిలోనే బహిరంగ సభకు పిలుపునివ్వడం గమనార్హం.

ఎప్పటిలాగే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత హోదాలో ఒక్కరే స్టేజి పై నుంచుని ప్రసంగిస్తారు. వినోద్ విషయం తో పాటు, ఇరు తెలుగు రాష్ట్రాల సమస్యలు,  తెలంగాణ కొత్త జిల్లాల ఏర్పాటు, మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ కోసం జరిపిన భూసేకరణ, ఆంధ్ర ప్రదేశ్ కి రావాల్సిన  ప్రత్యేక హోదా, మొదలగు ఎన్నో సమస్యలపై పవన్ ప్రసంగిస్తారని సమాచారం. అదే జరిగితే, అటు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కి, ఇటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పవన్ ఒకేసారి గట్టి దెబ్బ కొట్టినట్టవుతుంది.

ఈ వార్తను ఇంగ్లీష్ లో చదవడానికి క్లిక్ చేయండి