మహా ఒప్పందం చేసుకొంటే సంబురాలు ఎందుకో?

సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం మహారాష్ట్రతో  చేసుకొన్న ఒప్పందాన్ని టిఆర్ఎస్ సర్కార్ ‘మహా ఒప్పందం’ అని అభివర్ణిస్తూ సంబురాలు చేసుకొంది. కానీ ప్రతిపక్షాలు అదొక తెలంగాణ ద్రోహ ఒప్పందం అని అభివర్ణిస్తున్నాయి. అధికార ప్రతిపక్షాల వాదోపవాదనలలో నిజానిజాలు నిలకడ మీద తెలుస్తాయి. కానీ ముంబై నుంచి కెసిఆర్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకొన్నప్పుడు ఆయనకి స్వాగతం పలుకుతూ టిఆర్ఎస్ చేసిన హడావుడి కొంచెం శృతి మించడం, ఆ సందర్భంగా ప్రతిపక్షాలని ఉద్దేశించి కెసిఆర్ ‘ఆరోపణలని నిరూపించకపోతే జైలుకి పంపిస్తానని’ హెచ్చరించడం ప్రతిపక్షాలకి మంచి ఆయుధాలని  అందించినట్లయింది.

మహా ఒప్పందం వలన రాష్ట్రానికి మేలు కలిగితే మంచిదే కానీ అదేదో చాలా ఘనకార్యం అన్నట్లు అంత హడావుడి చేయడం ఎందుకు? అని ప్రతిపక్షాలకే కాదు సామాన్య ప్రజలకి కూడా సందేహం కలిగింది. అన్ని రాష్ట్రాలు ఏదో ఒక రాష్ట్రంతో ఒప్పందాలు చేసుకొంటూనే ఉంటాయి. కానీ ఈ విధంగా సంబురాలు చేసుకోవడం అరుదు. మరి టిఆర్ఎస్ సర్కార్ ఎందుకు ఇంత హడావుడి చేసింది? అంటే మహా ఒప్పందంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల వలన ప్రభుత్వం ఏదో పెద్ద తప్పు చేస్తోందని ప్రజలలో అనుమానాలు, అపోహలు కలుగకుండా ఉండేందుకే బహుశః అంత హడావుడి చేసి ఉండవచ్చు. ఆ ఒప్పందం తెలంగాణ సాధించినంత గొప్ప చారిత్రాత్మకమైన విషయమని ప్రజలు భావించేలా చేయడమే ప్రభుత్వ ఉద్దేశ్యం కావచ్చు. కానీ ప్రతిపక్షాలు మాత్రం ‘తెలంగాణ ప్రయోజనాలు మహారాష్ట్ర కి తాకట్టు పెట్టింది చాలక మళ్ళీ అదేదో ఘనకార్యమన్నట్లు సంబురాలు చేసుకోవడం సిగ్గు చేటు’ అని విమర్శిస్తున్నాయి.

ముఖ్యమంత్రి కెసిఆర్ మీడియా పట్ల, ప్రతిపక్షాల పట్ల గతంలో కూడా కొన్నిసార్లు ఇదే విధంగా తీవ్ర వ్యాఖ్యలు చేసి విమర్శలు మూటగట్టుకొన్నారు. మళ్ళీ నిన్న కూడా మరోసారి ప్రతిపక్షాలని జైలుకి పంపిస్తానని హెచ్చరించి వాటికి తనపై ఎదురుదాడి చేసే అవకాశం చేజేతులా కల్పించారని చెప్పక తప్పదు. కెసిఆర్ లో ఒక నియంత దాగి ఉన్నాడనే ప్రతిపక్షాలు వాదనకి ఆయన మాటలు అద్దం పట్టేవిగా ఉన్నాయి. ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా సవాలు విసిరి ఆత్మరక్షణలో పడేయ గలిగారు. కానీ మళ్ళీ అంతలోనే ప్రతిపక్షాలని జైలుకి పంపిస్తానని హెచ్చరించి వాటికి దొరికిపోయారు. మహా ఒప్పందం చేసుకొని వచ్చిందుకు టిఆర్ఎస్ సర్కార్ ఎంత భారీగా సంబురాలు నిర్వహించినా చివరికి ప్రతిపక్షాల చేతికి అవసరమైన ఆయుధాలు అన్నీ అందించడంతో అవన్నీ కూడగట్టుకొని చెలరేగిపోతున్నాయి.