కొత్త జిల్లాల ఏర్పాటుపై ఏకపక్ష నిర్ణయాలేల?

కొత్త జిల్లాల ఏర్పాటు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాత ముఖ్యమంత్రి కెసిఆర్ మీడియాతో మాట్లాడుతూ, “ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే జిల్లాల ఏర్పాటు జరుగుతుంది. ఈ నెల రోజుల్లో ప్రజలు, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నుంచి వచ్చే సూచనలు, సలహాలు అన్నీ పరిగణ లోకి తీసుకొని డ్రాఫ్ట్ లో అవసరమైన మార్పులు చేర్పులు చేసిన తరువాతే తుది నోటిఫికేషన్ జారీ చేస్తాము,” అని హామీ ఇచ్చారు.

కానీ, ప్రతిపక్షాలు మాత్రం ఈ విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఎవరి మాట వినకుండా ఏక పక్షంగా నిర్ణయాలు తీసుకొంటున్నారని విమర్శిస్తున్నాయి. ముఖ్యంగా వరంగల్ జిల్లాని రెండుగా విడదీయడాన్ని అందరూ తప్పు పడుతున్నారు.

ఆ జిల్లాకి చెందిన బిజెపి నేతలు ఎస్.మల్లారెడ్డి, చంద్రయ్య, నర్సింహ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “వరంగల్ జిల్లాని విభజించవద్దని ప్రతిపక్షాలు సూచిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అదే విధంగా టిఆర్ఎస్ కి అనుకూలంగా ఉండే నియోజకవర్గాన్ని ముట్టుకోకుండా వదిలిపెట్టి, అనుకూలంగా లేని వాటిని విభజిస్తోంది. శంషాబాద్ లో షాద్ నగర్ ని ఎందుకు కలుపుతున్నారో తెలియదు...వద్దని చెపుతున్నా వినడం లేదు. కొన్ని జిల్లాలకి సమ్మక్క, సారక్క, కొండా లక్ష్మణ్ బాపూజీ పేర్లని పెట్టమని ప్రతిపక్షాలు చేసిన సూచనలని కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. హైదరాబాద్, రంగారెడ్డిలో మండలాల సంఖ్య పెంచాలని అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న ప్రతిపక్షాల సూచనని కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. జనాభా ప్రాతిపదికన మండలాలు పునర్విభజన చేస్తామని కెసిఆర్ చెపుతారు కానీ ఆచరణలో అది కనబడదు. 1986లో రంగారెడ్డిలో జనాభా 16లక్షలు-37మండలాలు ఉన్నాయి. ఇప్పుడు జిల్లా జనాభా 60 లక్షలు దాటింది. కానీ అందుకు అనుగుణంగా మండలాల సంఖ్య పెంచడం లేదు. జిల్లాల ఏర్పాటులో ఎవరి సలహాలు స్వీకరించదలచుకోనప్పుడు, దానికోసం నోటిఫికేషన్ జారీ చేసి అందరి సలహాలు కోరడం దేనికి?” అని వారు ప్రశ్నించారు.

జిల్లాల ఏర్పాటు చేసే ముందు అవసరమైతే మరో రెండు సార్లు అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని కెసిఆర్ చెప్పారు. అయితే బిజెపి నేతలు చేస్తున్న ఈ విమర్శలని చూస్తే, మొదటి సమావేశంలో ప్రతిపక్షాలు చేసిన సూచనలనే ప్రభుత్వం పట్టించుకోలేదని అర్ధం అవుతోంది. కనుక మళ్ళీ సమావేశం అవడం వలన ఏమి ప్రయోజనం? జిల్లాల ఏర్పాటు అనేది రాష్ట్రానికి, ప్రజలందరికీ సంబంధించిన విషయమే తప్ప ఏ ఒక్కరికో, పార్టీకో సంబంధించిన విషయం కాదు. కనుక దానిపై ప్రజాభిప్రాయానికి అనుగుణంగా సమిష్టి నిర్ణయం తీసుకొంటే ఇటువంటి విమర్శలకి అవకాశం ఉండదు. ఒకవేళ ఈ విషయంలో ప్రతిపక్షాల సలహాలు వద్దనుకొంటే కనీసం మేధావుల సలహాలు స్వీకరించడం మంచిది.