తెలంగాణ కి కేంద్ర ప్రభుత్వం భారీ నజరానా

తెలంగాణ తో సహా దేశంలో అనేక రాష్ట్రాలలో మూడవ రైల్వే లైన్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. దానిలో వరంగల్ జిల్లా ఖాజీపేట నుంచి మహారాష్ట్రలోని బల్లార్షా వరకు 201.4 కి.మీ. పొడవైన 3వ రైల్వే లైన్ నిర్మాణం కోసం రూ.2,063 కోట్లు మంజూరు చేసింది. ఈ రైల్వే లైన్ మూడేళ్ళలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొంది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైల్వే బడ్జెట్ లో కొత్త ప్రాజెక్టులు, హామీలు గుప్పించకుండా ప్రాధాన్యతని బట్టి ప్రాజెక్టులని చేపట్టడం, పెండింగులో ఉన్న ప్రాజెక్టులని పూర్తి చేయడం, యావత్ రైల్వే వ్యవస్థని ఆధునీకరించడం వంటి వాటికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. అందుకే దేశంలో వివిధ రాష్ట్రాలలో చిరకాలంగా పెండింగులో ఉన్న3వ రైల్వే లైన్ నిర్మాణం కోసం భారీగా నిధులు విడుదల చేసింది. వాటిలో ఖాజీపేట-బలార్షా కున్న ప్రాధాన్యతని దృష్టిలో ఉంచుకొని నిధులు మంజూరు చేసింది.

తెలంగాణ రాష్ట్రాన్ని దేశ రాజధాని ఢిల్లీతో కలిపే ఈ ఖాజీపేట-బలార్షా రైల్వే లైన్ రాష్ట్రంలో వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల గుండా సాగుతుంది. ఈ మార్గంలో అనేక సిమెంట్ పరిశ్రమలు, ధర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉన్నసంగతి అందరికీ తెలిసిందే. కనుక వాటికి ఈ మార్గంలో భారీగా బొగ్గు, ఇతర ముడి ఖనిజాలు రవాణా అవుతుంటాయి. అదే విధంగా సిమెంట్ కంపెనీలలో తయారయ్యే సిమెంట్ కూడా వివిధ రాష్ట్రాలకి, జిల్లాలకి రవాణా అవుతుంటుంది. కనుక ఈ మార్గంలో 3వ రైల్వే లైన్ నిర్మాణం చాలా అవసరం ఉంది.

యూపియే ప్రభుత్వ హయంలో దానికోసం అభ్యర్ధించినా నిధుల కొరతని సాకుగా చూపుతూ వాయిదా వేసింది. కానీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ళలోనే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలతో సహా దేశంలో చాలా రాష్ట్రాలలో ఇటువంటి అత్యంత ప్రాధాన్యత గల మార్గాలలో 3వ రైల్వే లైన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. నిధులు మంజూరు చేయడమే కాక ఇప్పుడు మొదలుపెట్టబోయే ఈ 3వ రైల్వే లైన్ నిర్మాణాలన్నీ మూడేళ్ళలోనే పూర్తి చేయాలని డెడ్-లైన్ కూడా పెట్టుకోవడం గమనిస్తే మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధి అర్ధమవుతుంది. దేశాభివృద్ధి చేయాలనే తపన, చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఏదైనా సాధ్యమేనని మోడీ ప్రభుత్వం మరోసారి నిరూపిస్తోంది.