
రాష్ట్రంలో నానాటికీ కరోనా కేసులు పెరుగుతుండటంతో వైద్యులపై ఒత్తిడి పెరిగిపోతోంది. కనుక తాత్కాలిక ప్రాతిపదికన తక్షణమే 1,468 మంది వైద్యులను నియమించడానికి రాష్ట్ర ఆర్ధికశాఖ అనుమతి మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
వారిలో 227 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లుకాగా, 1,191 మంది పీజీ ఫైనల్ ఇయర్ చేస్తున్న వైద్య విద్యార్దులున్నారు. పీజీ విద్యార్దులను సీనియర్ రెసిడెంట్ డాక్టర్లుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
227 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్ల సేవలను 33 జిల్లాలోని ప్రైమరీ హెల్త్ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్లలో వినియోగించుకోవాలని నిర్ణయించింది. ప్రభుత్వం వీరిని ఆరునెలల కోసం తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకొంటోంది.
1,191 మంది పీజీ ఫైనల్ ఇయర్ చేస్తున్న వైద్య విద్యార్దులలో గాంధీ ఆసుపత్రిలో 250 మందిని, గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రిలో150 మందిని, కింగ్ కోఠీ ఆసుపత్రిలో 100 మందిని, ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రిలో 50 మందిని, రాష్ట్రంలోని 8 ప్రభుత్వ ఆసుపత్రులలో ఒక్కో ఆసుపత్రికి 50 మంది చొప్పున 400 మందిని, వైద్యవిధాన పరిషత్ ఆసుపత్రులలో మిగిలిన 241 మందిని సీనియర్ రెసిడెంట్ డాక్టర్లుగా ఏడాది ఒప్పందంతో నియమించుకోవాలని నిర్ణయించింది. వీరికి నెలకు రూ.70,000 జీతం చెల్లించాలని రాష్ట్ర ఆర్ధికశాఖ నిర్ణయించింది.