గోదావరి నదిపై ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్ట్ర తో ఒప్పందం చేసుకొని తిరిగివచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ కి బేగంపేట విమానాశ్రయం వద్ద స్వాగతం పలకడానికి వేలాదిగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ మహా ఒప్పందాన్ని తప్పు పడుతున్న కాంగ్రెస్ నేతలకి సవాలు విసిరారు.
“కాంగ్రెస్ హయాంలోనే తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుని 152 మీటర్ల ఎత్తుతో నిర్మించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం జరిగిందని, దానిని మా ప్రభుత్వం 148 మీటర్లకి ఒప్పందం కుదుర్చుకుందని, దాని వల్ల తెలంగాణకి అన్యాయం చేసిందని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. నేను ఇక్కడే మరో గంటో...అర్ధ గంటో ఉంటాను. ఒకవేళ వారు చెపుతున్నది నిజమైతే వారు ఆ ఒప్పందం కాపీనే తీసుకువచ్చి చూపిస్తే, నేను నా తప్పుని ఒప్పుకొని ఇటు నుంచి నేరుగా రాజ్ భవన్ కి వెళ్లి నా రాజీనామా పత్రం సమర్పించి పదవి నుంచి దిగిపోతాను. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొంటాను. నా సవాలుని స్వీకరించే దమ్ము కాంగ్రెస్ నేతలకి ఉందా?” అని కెసిఆర్ అడిగారు.
కెసిఆర్ విసిరిన ఈ సవాలుని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వీకరించకుండా ఆ ఒప్పందంలో వేరే అంశాల గురించి మాట్లాడటం గమనిస్తే ఈ ప్రాజెక్టు ఎత్తు విషయంలో కాంగ్రెస్ నేతలు ఇంతకాలం ప్రజలని తప్పుదారి పట్టిస్తున్నారని బయటపడింది.
“డీటేయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ వివరాలని టిఆర్ఎస్ ప్రభుత్వం గోప్యంగా ఎందుకు ఉంచుతోంది? దిగువనున్న తెలంగాణ లో ప్రాజెక్టులు కట్టుకొంటే దానికి మహారాష్ట్ర ఎందుకు అభ్యంతరం చెపుతుంది?అటువంటి దానికి ఒప్పందం చేసుకొని అదేదో చాలా ఘనకార్యం సాధించినట్లు ఈ హడావుడి, ప్రచారం ఎందుకు? రూ.84,000 కోట్లు ప్రజాధనం వృధా చేస్తూ దానికి లెక్కలు అడిగితే కెసిఆర్ ఎందుకు ఉలికి పడుతున్నారు”? అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.
మహారాష్ట్ర తో ఒప్పందం అవసరమే లేదనుకొంటే మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఒప్పందం చేసుకొంది? ప్రాజెక్టు ఎత్తు గురించి ఇంతకాలం ఎందుకు అబద్ధాలు చెప్పింది? అనే రెండు ప్రశ్నలకి కాంగ్రెస్ పార్టీయే సమాధానం చెప్పాలి.
కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పలేరు కనుక కెసిఆరే దానికి సమాధానం చెప్పారు. ఆయన మాట్లాడుతూ, “రెండేళ్లుగా కాంగ్రెస్ నేతలు మా ప్రభుత్వంపై ఎన్ని ఆరోపణలు చేస్తున్నా నేను మౌనంగా భరిస్తున్నాను. కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణలో 98 లక్షల ఎకరాలలో నీళ్ళు పారించి ఉండి ఉంటే మరి ఆ నీళ్ళన్నిటినీ కాకి ఎత్తుకు పోయిందా? పిట్టలు ఎత్తుకు పోయాయా? నీళ్ళు లేవనేకదా కొట్లాడి తెలంగాణా సాధించుకొన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణ అంతటా నీళ్ళు పారించి ఉంటే ఈ రోజు రాష్ట్రంలో ఈ పరిస్థితి ఎందుకు ఉంది? అప్పుడే ఒప్పందం చేసుకొంటే తుమ్మిడి హెట్టిలో ఎప్పుడైనా తట్టెడు మట్టి ఎత్తారా? ఇంతవరకు ఆ ప్రాజెక్టు ఎందుకు మొదలుపెట్టలేదు?” అని ప్రశ్నించారు.
“మా ప్రభుత్వం కోటి ఎకరాలకి నీళ్ళు పారించాలని పట్టుదలగా కృషి చేస్తుంటే, ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తూ మమ్మల్ని ఆడుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ కెసిఆర్ మొండి. తెలంగాణా సాధించాలని పట్టుబట్టి సాధించుకొన్నాడు. ఇప్పుడు కోటి ఎకరాలకి నీళ్ళు అందించాలని సంకల్పించుకొన్నాను. తప్పకుండా అది కూడా సాధించి చూపుతాను. నాకు ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా నా లక్ష్యం నుంచి నా దృష్టి మరల్చలేరు. మా ప్రభుత్వం లేనిపోని విమర్శలు చేస్తున్నవారు తమ ఆరోపణలకి ఆధారాలు చూపించాలి. లేకుంటే అందరిపై కేసులు పెడతాము. అప్పుడు జైలుకి వెళ్లి చిప్పకూడు తినాల్సి వస్తుంది. త్వరలోనే తెలంగాణ అంతటా బస్సు యాత్ర చేసి ప్రాజెక్టుల గురించి, వాటిని అడ్డుకొనేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రల గురించి ప్రజలకి వివరించి చెపుతాను. అవసరమైతే టీవీ స్టూడియోలో రెండు మూడు గంటలు కూర్చొని అన్నీ మాట్లాడతాను. కాంగ్రెస్ నేతల బండారం బయటపెడతాను,” అని ముఖ్యమంత్రి కెసిఆర్ హెచ్చరించారు. దీనికి కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో చూద్దాం.