కొత్త జిల్లాల ఏర్పాటుపై టీ-రాజకీయ జేఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పందించారు. ఆయన జిల్లాల పునర్విభజనని వ్యతిరేకించనప్పటికీ ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “కొత్త జిల్లాలను ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేయబోతున్నారో ఆ వివరాలని ప్రజలకి అందుబాటులో ఉంచినట్లయితే, వాటిపై ఈ నెల రోజుల్లో చర్చించడానికి వీలుపడుతుంది. జిల్లాల ఏర్పాటు హేతుబద్దంగా, ప్రజాభీష్టానికి అనుగుణంగానే జరపాలి. పంచాయితీలని, గిరిజన తండాలని బలోపేతం చేసే విధంగా జిల్లాల ఏర్పాటు జరగాలి. ముఖ్యంగా ఆదివాసీల సమగ్రతని కాపాడాలి. వరంగల్ జిల్లాని రెండుగా విభజించే ఆలోచనని ప్రభుత్వం పునః సమీక్షించుకొంటే బాగుంటుంది. జిల్లాల ఏర్పాటులో తుది నిర్ణయం ప్రజాభీష్టానికి అనుగుణంగానే ఉండాలి,” అని అన్నారు.
ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న రాజకీయ పార్టీలు, తమ ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని అందుకు అనుగుణంగానే వాదిస్తున్నాయి. కానీ ప్రొఫెసర్ కోదండరాం రాజకీయాలకి అతీతంగా వ్యవహరిస్తుంటారు. ఆయనకి తెలంగాణ పట్ల మంచి అవగాహన కూడా ఉంది. కనుక ఆయన జిల్లాల ఏర్పాటుపై మరింత లోతుగా విశ్లేషించి కొత్త జిల్లాల ఏర్పాటులో మంచి చెడులని, సాధకబాధకాలని ప్రజలకి వివరించి మార్గదర్శనం చేసి ఉండి ఉంటే బాగుండేది.
కొత్త జిల్లాలు ఏర్పాటు వలన నష్టాలు ఏమిటి?
పరిపాలనా వికేంద్రీకరణ, పాలనా సౌలభ్యం కోసమే జిల్లాల పునర్విభజన చేస్తున్నట్లు టిఆర్ఎస్ ప్రభుత్వం చెపుతోంది. కానీ 10 జిల్లాలని 27 జిల్లాలుగా మార్చడం వలన ఇంకా కొత్త ఇబ్బందులని సృష్టించుకొన్నట్లే అవుతుందని చెప్పవచ్చు. ఉదాహరణకి:
1. ఇప్పటివరకు పది మంది జిల్లా కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, డీ.ఎస్.పి.లు వగైరాలు ఉంటే, ఇప్పుడు వారి సంఖ్య 27కి పెరుగుతుంది. దానితో పాటే వారికి కార్యాలయాలు, జీతభత్యాలు, వాహనాలు, ఇతర సౌకర్యాలు కల్పించవలసి ఉంటుంది. అంటే ఇది వరకు ఉన్న ఖర్చుకి, ఉద్యోగుల సంఖ్య ఒకేసారి దాదాపు రెండు రెట్లు పెరుగుతుందని స్పష్టం అవుతోంది. ఆ భారం ప్రజలే భరించాల్సి ఉంటుందని వేరేగా చెప్పనవసరంలేదు.
2. పెద్ద జిల్లాలని చిన్న చిన్న జిల్లాలుగా విడగొట్టడం వలన వాటిలో పెద్ద పెద్ద నగరాలు ఏర్పడే అవకాశం ఉండదు. తద్వారా హైదరాబాద్ వంటి నగరాలతో పోటీపడుతూ అభివృద్ధి చెందలేవు. ఆ కారణంగా ఆర్ధికంగా ఎప్పటికీ అవి రాష్ట్ర ప్రభుత్వం విదిలించే నిధులపైనే ఆధారపడి ఉండవలసి వస్తుంది.
3. జిల్లాలలో ఉన్న సహజవనరులు రెండు జిల్లాల మధ్య చీలిపోతే, వాటి మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. అదే కారణంగా కొన్ని పేద జిల్లాలుగా, మరికొన్ని ధనిక జిల్లాలుగా ఆవిర్భవిస్తాయి. కనుక వాటి మధ్య అంతరం ఏర్పడుతుంది.
4. 2026 సంవత్సరం వరకు నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం పదేపదే చెపుతోంది. కనుక జిల్లాల సంఖ్య పెరిగినప్పటికీ కొత్తగా శాసనసభ స్థానాలు పెరిగే అవకాశం లేదు. పైగా ఉన్న జిల్లాలనే చిన్నచిన్నవిగా విడగొట్టడం వలన రాజకీయ నేతల మధ్య ఇంకా పోటీ పెరుగుతుంది. అది అశాంతికి దారి తీయవచ్చు.
5. భూపాలపల్లిని జిల్లాగా ప్రకటించడం వలన ఏమీ ప్రయోజనం లేదని అదొక బొందల గడ్డగానే మిగులుతుందని ప్రొఫెసర్ కోదండరాం స్వయంగా చెప్పారు. మరికొన్ని జిల్లాల గురించి ప్రతిపక్షాలు కూడా అటువంటి లోపలనే ఎత్తి చూపిస్తున్నాయి. కనుక జిల్లాల పునర్విభజనలో అవసరమనుకొంటేనే శాస్త్రీయంగా విభజించడం మంచిది.
కనుక ప్రొఫెసర్ కోదండరాం వంటి మేధావులు ముందుకు వచ్చి దీనిపై ప్రభుత్వానికి, ప్రజలకి కూడా తమ అభిప్రాయాలు, తగిన సలహాలు ఇచ్చి మార్గదర్శనం చేయడం మంచిది. జిల్లాల పునర్విభజన ముఖ్య ఉద్దేశ్యం ప్రజలకి అవసరమైన సౌకర్యాలు, సేవలు అందుబాటులోకి తీసుకురావడమే కనుక కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి అదనపు భారం పెంచుకోవడంకంటే, ఉన్న జిల్లాలలోనే అధనంగా అధికారులని నియమించి, అధనంగా కళాశాలలు, కాలేజీలు, ఆసుపత్రులు, పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, బస్సు డిపోలు, రోడ్లు, మౌలికవసతులు కల్పిస్తే సరిపోయేదేమో కదా? అందరూ ఆలోచిస్తే మంచిది.