అది నిజంగానే మహా ఒప్పందమా కాదా?

ఈరోజు తెలంగాణ, మహారాష్ట్రాలు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం ‘మహా ఒప్పందం’ చేసుకున్నారు. వాటిలో గోదావరిపై మేడిగడ్డ వద్ద కాళేశ్వరం, ప్రాణహిత నదిపై అదే పేరుతో ప్రాజెక్టు, పెన్ గంగపై చానాకా-కోరాట ప్రాజెక్టుల నిర్మాణం కోసం రెండు రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో కనీసం 30లక్షల ఎకరాలకి నీళ్ళు అందించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం కాంగ్రెస్ హయాంలో రూపొందించిన డిజైన్లలో, పేర్లలో కూడా మార్పులు చేర్పులు చేసి, ఇదివరకు మహారాష్ట్రతో చేసుకొన్న ఒప్పందాన్ని మార్చి తాజాగా ఈ ఒప్పందం చేసుకొంటోంది.

ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి అవరోధంగా నిలిచిన సమస్యలన్నిటినీ తెలంగాణ ప్రభుత్వం ఒకటొకటిగా పరిష్కరించుకొంటూ చివరికి ఈరోజు మహా ఒప్పందం చేసుకుంది. వీటికి నిధుల కొరత కూడా లేదు కనుక ఈ ఒప్పందంపై సంతకాలు చేయగానే ప్రాజెక్టు నిర్మాణ పనులు మొదలుపెట్టేందుకు మార్గం సుగమం అవుతుంది. ఒకవేళ ప్రభుత్వం ఇదే ఊపులో నిర్మాణ పనులు కూడా పూర్తి చేసినట్లయితే, వచ్చే ఎన్నికలనాటికి ఈ ప్రాజెక్టులకి రూపురేఖలు వస్తాయి. అవి టిఆర్ఎస్ ప్రభుత్వ దీక్షా దక్షతలకి, కృషికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలబడతాయి. పంటలకి నీళ్ళు అంది రైతుల మొహాల్లో చిరునవ్వులు కనబడతాయి.

కానీ ఈ మహా ఒప్పందం వలన రాష్ట్రానికి నష్టమే తప్ప ఏమాత్రం లాభం లేదని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. దానికి నిరసనగా వారు ఈరోజు పాదయాత్రలు, ధర్నాలు చేస్తున్నారు. తమ ప్రభుత్వ హయాంలో రూపొందించిన ప్రాజెక్టులకే టిఆర్ఎస్ సర్కార్ పేర్లు, డిజైన్లు, ఒప్పందాలు అన్నీ మార్చి ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తున్నారు. పైగా మహారాష్ట్రకి మేలు చేకూర్చే విధంగా తుమ్మిడి హెట్టి వద్ద నిర్మిస్తున్న ప్రాణహిత ప్రాజెక్టు ఎత్తుని 152 మీటర్ల నుంచి148 మీటర్లకి తగ్గించిందని, కానీ ఆ ప్రాజెక్టు అంచనాలు మాత్రం మూడింతలు పెంచి వేసిందని ఆరోపిస్తున్నారు. ఇవన్నీ టిఆర్ఎస్ నేతలు తమ జేబులు నింపుకోవడానికేనని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

కాంగ్రెస్ హయాంలోనే ప్రాణహిత ప్రాజెక్టు ఆలోచన మొదలుపెట్టిన మాట వాస్తవం. అప్పటి పరిస్థితులని, నీటి లభ్యత, అవసరాలు, నిర్మాణ ఖర్చులని బట్టి ఆ ప్రాజెక్టుని రూపొందించారు. అయితే రాష్ట్రాన్ని పదేళ్ళు పాలించినా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టులని మొదలు పెట్టలేకపోయింది. కనుక వాటి గురించి కాంగ్రెస్ పార్టీ గొప్పలు చెప్పుకోవడం కాదు...సిగ్గుపడాలి. తాము చేయలేని పనులని టిఆర్ఎస్ సర్కార్ చేస్తున్నందుకు అభినందించాలి.

రాష్ట్రంలో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే లోతుగా అధ్యయనం చేసి ప్రాజెక్టుల నిర్మాణానికి సర్వం సిద్ధం చేస్తోంది. రెండు మీటర్ల ఎత్తు తగ్గించుకొనైనా ఏదో విధంగా ప్రాజెక్టు పూర్తి చేసుకొంటే పంటలకి నీళ్ళు అందించవచ్చు కానీ ప్రాజెక్టు ఎత్తుపై పొరుగు రాష్ట్రంతో దశాబ్దాల తరబడి యుద్ధాలు చేయడం వలన నష్టపోయేది మన రాష్ట్రమే. అందుకే టిఆర్ఎస్ సర్కార్ పట్టువిడుపులు ప్రదర్శిస్తూ శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణానికి సిద్ధం అవుతోంది. వాటి వలన రాష్ట్రానికి చాలా మేలు కలుగుతుందే తప్ప నష్టం జరుగదు కదా? కాంగ్రెస్ పార్టీ నేతలు తాము చేయలేని ఈ పనులని టిఆర్ఎస్ సర్కార్ చేస్తుంటే అడ్డుపడటం తెలంగాణ  అభివృద్ధిని అడ్డుకోవడమేనని చెప్పక తప్పదు.