రెండు తెలుగు రాష్ట్రాలని, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పునాదులని కదిలించేసిన ఓటుకి నోటు కేసులో 4వ నిందితుడుగా ఉన్న జెరూసలెం మత్తయ్య హఠాత్తుగా చాలా విషయాలు మాట్లాడేశాడు. ఈ కేసుతో తనకి ఎటువంటి సంబంధం లేదని కానీ కెసిఆర్ తనని అన్యాయంగా ఇరికించారని మత్తయ్య చెప్పాడు. ఈ కేసు బయటపడినప్పుడు, ఏపి సిఎం చంద్రబాబు చాలా భరోసా ఇచ్చారని కానీ ఇప్పుడు ఆయన కూడా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఆడుకొన్న రాజకీయ చదరంగంలో తనని బలిపశువుని చేశారని, వారిద్దరి వలన తనకి ప్రాణహాని ఉందని అందుకే ఢిల్లీ లోనే ఉండిపోయానని మత్తయ్య చెప్పాడు. జాతీయ మానవహక్కుల సంఘంలో కూడా ఫిర్యాదు చేస్తూ ఒక పిటిషన్ వేశానని చెప్పాడు. త్వరలో సుప్రీంకోర్టులో కౌంటర్ పిటిషన్ వేసినప్పుడు తన న్యాయవాదికి ఓటుకి నోటు కేసులో చంద్రబాబు తదితరుల పాత్ర గురించి వివరిస్తారని చెప్పాడు.
ఇది చెప్పిన 24గంటలలోనే మత్తయ్య మళ్ళీ మాట మార్చి, ఓటుకి నోటు కేసులో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలుకి వెళ్ళినప్పటికీ, చంద్రబాబు మాత్రం పెద్ద మనసుతో ఫోన్ ట్యాపింగ్ కేసుని విడిచిపెట్టేశారని చెప్పాడు. “అయినా టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా చాలా మంది కాంగ్రెస్, టిడిపి ఎమ్మెల్యేలని కొనుక్కుంది కదా...మరి అటువంటప్పుడు ఈ ఓటుకి నోటు కేసు మాత్రం ఎందుకు?” అని ప్రశ్నించాడు. ఓటుకి నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసులలో ఇద్దరు ముఖ్యమంత్రులు రాజీపడి కేసులని ఉపసంహరించుకొని దాని నుంచి తనకి విముక్తి కల్పించాలని కోరాడు.
ఇద్దరు ముఖ్యమంత్రుల నుంచి తనకి ప్రాణహాని ఉందని మత్తయ్య చెప్పడం చాలా సంచలనమైన విషయమే. కానీ, మళ్ళీ 24 గంటల వ్యవధిలోనే మాట మార్చి చంద్రబాబుకి అనుకూలంగా మాట్లాడటం గమనిస్తే అతను చెబుతున్న దానిలో ఎంతో కొంత నిజం ఉందనే అర్ధం అవుతోంది. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలుపై తను కౌంటర్ వేసినప్పుడు, ఓటుకి నోటు కేసులో తెర వెనుక పెద్దమనుషుల గురించి, ఆ కేసు గురించి తన న్యాయవాది చెపుతారనడం బెదిరించడమేనని భావించవచ్చు. బహుశః అందుకే మత్తయ్యపై ఆ తెర వెనుక ఉన్న ఆ పెద్ద మనుషులు ఒత్తిడి చేస్తే అతను మాట మార్చాడేమో? ఏమైనప్పటికీ ఈ కేసులో చాలా పెద్ద తలకాయలున్నాయి. ఈ కేసు వారి రాజకీయ జీవితంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది కనుక మత్తయ్యకి ప్రాణహాని ఉండే అవకాశం ఉందనే భావించవచ్చు.