ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుసుమంచి మండల నాయకన్ గూడెం వద్ద కాలువలోకి బస్సు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో పది మంది అక్కడికక్కడే మృత్యువాత పడగా, మరో 20 మంది గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న అస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా వుందని వైద్యులు చెబుతున్నారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో మొత్తం ముప్పై మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం.
హైదరాబాద్ మియాపూర్ నుంచి సూర్యపేట, ఖమ్మం మీదుగా రాజమండ్రి వయా కాకినాడకు వెళుతున్న ప్రైవేటు బస్సు, నాయకన్ గూడెం వద్ద వున్న మలుపును అందులోని డ్రైవర్ గమనించక, అతివేగంగా పోనివ్వడంతో.. మలుపు వద్ద అదుపు తప్పిన బస్సు, ఒక్కసారిగా నాగార్జున సాగర్ (ఎన్ఎస్ పీ) కాలువలోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న రెస్య్కూ టీం, పోలీసు అధికారులు ఘటనా స్థలికి చేరుకొని, పర్యవేక్షించి, సహాయక చర్యలు చేపట్టారు. కాల్వలో నాలుగు అడుగుల మేర నీళ్లు ఉండటంతో 2 క్రేన్ల సహాయంతో బస్సును బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది.
మరొకొంతమందిని పాలేరు, నాయకన్‌గూడెం ఆస్పత్రులకు తరలించారు. ఆస్పత్రికి తరలిస్తుండగా ఒకరు మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. నెల్లూరుకు చెందిన జనార్దన్ రెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్ అయిన బస్సు నెంబర్ ఏపీ26 టీసీ9512 గా పోలీసులు గుర్తించారు. కాగా, ఖమ్మం జిల్లాలో బస్సు ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలూపుతూ, గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.